ఇరాన్‌లో భూకంపం.. ఏడుగురి మృతి.. - 300 మందికి గాయాలు
భూకంప ప్రభావంతో ఖోయ్ నగరంలో పలు భవనాలు కుప్పకూలాయి. ఊహించని పరిణామంతో జనం భయంతో పరుగులు తీశారు. కూలిన భవనాల శిథిలాల్లో అనేకమంది చిక్కుకున్నారు.
ఇరాన్‌లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అధికారులు గుర్తించారు. భూకంపం తాకిడికి పలు భవనాలు కూలిపోయాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏడుగురు మృతిచెందారు. మరో 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం వచ్చిన ప్రాంతం ఇరాన్‌లోని పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ అనే నగరంగా గుర్తించారు. ఇది టర్కీ సరిహద్దుకు సమీపంలో ఉంది.
భూకంప ప్రభావంతో ఖోయ్ నగరంలో పలు భవనాలు కుప్పకూలాయి. ఊహించని పరిణామంతో జనం భయంతో పరుగులు తీశారు. కూలిన భవనాల శిథిలాల్లో అనేకమంది చిక్కుకున్నారు. అక్కడి అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు గుర్తించారు. గాయపడినవారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని బయటికి తీసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.