Telugu Global
International

అమెరికా చరిత్రలోనే తొలిసారి... కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన సియాటిల్ నగరం

అనేక కార్పోరేట్ కంపెనీలలో భారతీయులు ఈ కుల వివక్షకు బలవుతున్నారు. అగ్రకుల భారతీయులు ముఖ్యమైన పోస్టుల్లో ఉన్న చోట దళితులు మరింత వివక్షను ఎదుర్కోవడమే కాక , హేళనలు ఎదుర్కోవడం, ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సియాటిల్ నగర కౌన్సిల్ కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది.

అమెరికా చరిత్రలోనే తొలిసారి... కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన సియాటిల్ నగరం
X

కులమే లేని అమెరికాలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఓ నగర కౌన్సిల్ తీర్మానం చేయడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మనదేశం నుండి అక్కడికి పాకిన అగ్ర కుల అహంకార ఫలితం. అమెరికాకు బతకడానికి వెళ్ళిన భారతీయులు తమతో పాటు తమ కులాన్ని కూడా తీసుకెళ్ళారు. కింది కులాలను వివక్షకు గురి చేసే అగ్రకుల మనస్థత్వాన్ని కూడా తీదుకెళ్ళారు. దాంతో అక్కడ కూడా దళితులు, ఇతర బహుజన కులాలు అగ్రకులాల నుండి అమెరికాలో కూడా వివక్ష ఎదుర్కోవాల్సి వస్తున్నది.

అనేక కార్పోరేట్ కంపెనీలలో భారతీయులు ఈ కుల వివక్షకు బలవుతున్నారు. అగ్రకుల భారతీయులు ముఖ్యమైన పోస్టుల్లో ఉన్న చోట దళితులు మరింత వివక్షను ఎదుర్కోవడమే కాక , హేళనలు ఎదుర్కోవడం, ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సియాటిల్ నగర కౌన్సిల్ కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది.

"అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో కుల పక్షపాతానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కూడా ఒక భాగం " అని చట్టాన్ని ప్రవేశపెట్టిన‌ కౌన్సిల్ ఉమెన్ క్షమా సావంత్ అన్నారు.

యుఎస్‌లో కుల పక్షపాతం మరింత ప్రబలంగా మారకుండా నిరోధించడానికి ఇది అవసరమని ఆమె అన్నారు.

ఇటీవలి సంవత్సరాలలో US విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో, కార్పోరేట్ కంపెనీలలో సాగుతున్న కుల పక్షపాతంపై యుద్దమే ఈ నిషేధ తీర్మానం అని సావంత్ అన్నారు.

"కుల వివక్షను దక్షిణాసియా అమెరికన్లు, ఇతర వలస శ్రామిక ప్రజలు వారి కార్యాలయాలలో, టెక్ సెక్టార్‌తో సహా, సీయాటెల్లో, దేశంలోని ఇతర నగరాల్లో ఎదుర్కొంటున్నారు." అని ఆమె తెలిపారు.

సావంత్, ఒక సోషలిస్ట్. భారతదేశంలోని హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, పెరిగిన తాను భారత దేశంలోని కుల వివక్షకు ప్రత్యక్ష సాక్షమని ఆమె చెప్పారు.

కాగా, ఈ చర్యను కొన్ని హిందూ అమెరికన్ గ్రూపులు వ్యతిరేకించాయి, US చట్టం ఇప్పటికే ఇటువంటి వివక్షను నిషేధిస్తున్నందున ఈ నిషేధం అవసరం లేదని వాదించారు.

వాషింగ్టన్ DC లోని హిందూ అమెరికన్ ఫెడరేషన్ తన బహిరంగ లేఖలో, ''ఆర్డినెన్స్ లక్ష్యాలు ప్రశంసించదగినవే అయినప్పటికీ, ఇది ఎప్పుడో వారి పూర్వీకులు చేసిన దానిని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు లేని వివక్ష బూచిని చూపి మొత్తం సమాజాన్ని వేరు చేసే లక్ష్యం " అని పేర్కొంది.

వాషింగ్టన్ రాష్ట్ర జనాభాలో భారతీయ అమెరికన్లు 2% కంటే తక్కువగా ఉన్నారని, కుల వివక్షకు సంబంధించి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయని వారు వాదించారు.

మరో వైపు మంగళవారం జరిగిన నగర కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడేందుకు 100 మందికిపైగా గతవారం ప్రారంభంలోనే తమ పేరును నమోదు చేసుకున్నారు.

కాగా, ఈ ఆర్డినెన్స్‌కు మద్దతుగా సియాటెల్‌లో, ఇతర ప్రాంతాల్లో దళితులు ర్యాలీలు తీశారని కాలిఫోర్నియాకు చెందిన ఈక్వాలిటీ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు తేన్‌మొళి సౌందరరాజన్ తెలిపారు.

First Published:  22 Feb 2023 3:41 PM IST
Next Story