Telugu Global
International

ప్రపంచపటంలో పెను మార్పు.. ఖండాలు 7 కాదు 8..

జియోలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం ‘జిలాండియా లేదా లె రియు-ఎ-మౌయి’ అని పిలువబడే ఖండం మ్యాపును రూపొందించారు. సముద్రం అడుగు భాగంలోని రాళ్ల నమూనాల డేటాను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు దీన్ని కనుగొన్నారు.

ప్రపంచపటంలో పెను మార్పు.. ఖండాలు 7 కాదు 8..
X

చిన్నప్పటి నుంచి ఖండాలెన్ని, అవి ఏవి అని అడిగితే వెంటనే .. ఖండాలు 7 .. అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని టకటక చెప్పడం అలవాటు అయిపొయింది కదా.. ఇప్పుడు మనం ఆ జవాబు మార్చుకోవాలి. ఎందుకంటే 375 ఏళ్లుగా తప్పిపోయిన ఓ ఖండాన్నిశాస్త్రవేత్తలు కనుగొన్నారు. జియోలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం ‘జిలాండియా లేదా లె రియు-ఎ-మౌయి’ అని పిలువబడే ఖండం మ్యాపును రూపొందించారు. సముద్రం అడుగు భాగంలోని రాళ్ల నమూనాల డేటాను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న ఏడు ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది. దీంతో మొత్తం ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే అవకాశం ఉంది.


అతి ప్రాచీన ఖండం గోండ్వానాలో భాగమైన జిలాండియా కాలక్రమేణా వేరుపడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఖండం మొత్తం విస్తీర్ణం 4.9 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో ఇది మడగాస్కర్‌కు ఆరు రెట్లు ఉంటుంది. పసిఫిక్‌ మహా సముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా 94 శాతం నీటిలోనే ఉంది. మిగతా ప్రాంతం చిన్నచిన్న దీవులతో న్యూజిలాండ్‌ మాదిరిగా ఉంది. కొత్తగా కనుగొన్న ఈ కాంటినెంట్ ప్రపంచంలోనే చిన్న ఖండంగా పేరు సంపాదించుకుంది.

నిజానికి డచ్‌ సెయిలర్‌ అబెల్‌ టాన్మాన్‌ 1642లో మొదటిసారిగా జిలాండియా గురించి ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆయన సరైన ఆధారాలను సమర్పించలేకపోయారు. 375 ఏండ్ల తర్వాత జీఎన్‌ఎస్‌ పరిశోధకులు జిలాండియా ఉనికిని నిర్ధారించారు. ప్రస్తుతం సైంటిస్టులు సముద్రం అడుగుభాగంలోని రాళ్లు, అవక్షేప నమూనాలను స్టడీ చేస్తున్నారు. వీటిలో చాలా వరకు డ్రిల్లింగ్ నుంచి కొన్ని ద్వీపాల తీర ప్రాంతాల నుంచి సేకరించారు. ఈ రాతి నమూనాలు పశ్చిమ అంటార్కిటికా, న్యూజిలాండ్ పశ్చిమ తీరంలోని క్యాంప్ బెల్ పీఠభూమి సమీపంలోని సబ్ డక్షన్ జోన్ పోలికను కలిగి ఉన్నాయి.


First Published:  28 Sept 2023 11:39 AM IST
Next Story