Telugu Global
International

రష్యాలో మగాళ్లకు లక్ష్మణ రేఖ..

అధికారుల ఆదేశాలతో రష్యన్ ఎయిర్ లైన్స్, రైల్వే సంస్థలు పురుషులకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు దేశం దాటి వెళ్లడానికి వీళ్లేకుండా చేశారు.

రష్యాలో మగాళ్లకు లక్ష్మణ రేఖ..
X

రష్యా ప్రభుత్వం మగాళ్లకు లక్ష్మణ రేఖ గీసింది. దేశం దాటి వెళ్లేందుకు అనుమతి లేకుండా చేసింది. ఉక్రెయిన్‌పై దాడి ఉధృతం చేసే క్రమంలో దేశంలో మార్షల్ లా విధించే అవకాశాలున్నాయంటూ మీడియాలో కథనాలు రావడంతో.. సైన్యం కోసం తమను ఎక్కడ బలిచేస్తారోననే ఉద్దేశంతో పెద్దఎత్తున రష్యా నుంచి పురుషులు విదేశాలకు వెళ్తున్నారు. అయితే అధికారులు ముందుగానే వారిని నిలువరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారుల ఆదేశాలతో రష్యన్ ఎయిర్ లైన్స్, రైల్వే సంస్థలు పురుషులకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు దేశం దాటి వెళ్లడానికి వీలు లేకుండా చేశాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతించిన యువకులకు మాత్రమే దేశం నుంచి బయటకు వెళ్లేందుకు టికెట్లు ఇస్తున్నారు.

మరో వైపు రష్యా నుంచి వలసలు కూడా పెరిగాయని తెలుస్తోంది. సమీప దేశాలైన అర్మేనియా, జార్జియా, అజర్‌ బైజాన్, కజకిస్తాన్.. దేశాలకు వెళ్లే అన్ని విమానాల టిక్కెట్లు ముందుగానే బుక్ అయిపోయాయి. రష్యా నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్లే అన్ని విమానాల టిక్కెట్లు వారం రోజుల ముందుగానే బుక్ అయిపోయినట్టు టర్కీ ఎయిర్‌ లైన్స్‌ పేర్కొంది.

ఖైదీలే సైనికులుగా..

మరోవైపు ఉక్రెయిన్‌పై దాడి కోసం భారీగా సైనిక నియామకాలు కూడా చేపట్టబోతోందట రష్యా. జైళ్లలో ఖైదీలుగా ఉన్నవారిని కూడా సైన్యంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఖైదీల రిక్రూట్‌మెంట్‌ను వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ఆధ్వర్యంలో మొదలైనట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రిక్రూట్‌ చేసే ఖైదీలకు ఆరు నెలల తర్వాత అధ్యక్షుడి క్షమాభిక్షతోపాటు నెలకు లక్ష రూబుల్స్‌ వేతనంగా ఇస్తామని వాగ్నర్ సంస్థ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలతో కొత్తగా 3 లక్షల మందిని సైన్యంలోకి తీసుకుంటున్నామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు.

First Published:  22 Sept 2022 3:01 PM GMT
Next Story