Telugu Global
International

చ‌నిపోయింది ప్రిగోజినే.. ధ్రువీక‌రించిన ర‌ష్యా

ఈ ప్రమాదానికి రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ కూడా ఓ కారణమై ఉండొచ్చని వార్తలు వినపడుతున్నాయి. మృతి చెందిన వారిలో ప్రిగోజిన్‌కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి ఉల్కిన్ కూడా ఉన్నట్లు రష్యా తాజాగా వెల్లడించింది.

చ‌నిపోయింది ప్రిగోజినే.. ధ్రువీక‌రించిన ర‌ష్యా
X

బుధ‌వారం జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో మృతిచెందింది వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్నీ ప్రిగోజిన్ (62) అని ర‌ష్యా ఆదివారం అధికారికంగా ధ్రువీక‌రించింది. ప్రిగోజిన్ ఆధ్వ‌ర్యంలోనే అక్క‌డి ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు ఇటీవ‌ల ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌పై ఒక‌రోజు తిరుగుబాటు చేసింది. అయితే ఆ వెంట‌నే ఈ గ్రూపు వెన‌క్కి త‌గ్గిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం నాటి విమాన ప్ర‌మాదంలో ప్రిగోజిన్‌తో పాటు మొత్తం 10 మంది మృతిచెందారు. ఆ విమానంలో ప్రిగోజిన్ ఉన్నాడ‌ని స‌మాచారం ఉంద‌ని, దానిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని రష్యా తెలిపింది. తాజాగా వివిధ ప‌రీక్ష‌లు, ద‌ర్యాప్తుల అనంత‌రం ఆ ప్ర‌మాదంలో మృతిచెందింది ప్రిగోజినే అని ర‌ష్యా ధ్రువీక‌రించింది. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా అంతుచిక్కక పోవడం గమనార్హం.

ఈ ప్రమాదానికి రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ కూడా ఓ కారణమై ఉండొచ్చని వార్తలు వినపడుతున్నాయి. మృతి చెందిన వారిలో ప్రిగోజిన్‌కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి ఉల్కిన్ కూడా ఉన్నట్లు రష్యా తాజాగా వెల్లడించింది. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున క్రియాశీలకంగా పోరాడాడు. పుతిన్‌కి అత్యంత సన్నిహితుడిగా అత‌నికి పేరుంది. అధ్యక్షుడి అండతో ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగి వాగ్నర్ ముఠాకు అధినేత అయ్యాడు.

వాగ్నర్ గ్రూపు ఆఫ్రికాలోని మాలి తదితర చోట్ల పనిచేస్తోంది. వాగ్నర్ బృందంలో 90 శాతం మంది ఖైదీలే అని అమెరికా ఓ నివేదికలో పేర్కొంది. హత్య, ఇతర క్రూర నేరాలు చేసిన వ్యక్తులను వాగ్నర్ ముఠా సైనికులుగా చేర్చుకుంటుంది. ప్రిగోజిన్ అగ్రరాజ్యాల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. తిరుగుబాటు అనంత‌రం ఇటీవలే ప్రిగోజిన్‌.. పుతిన్‌తో భేటీ అయ్యాడు. అత‌నికి పుతిన్ బెలార‌స్‌లో ఆశ్ర‌య‌మిచ్చారు. వాగ్నర్ గ్రూపు సభ్యులు రిటైరవడానికి గానీ, రష్యా సైన్యంలో చేరడానికి గానీ అనుమతించారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

*

First Published:  28 Aug 2023 7:39 AM IST
Next Story