సిరియా అంతర్యుద్ధం వెనక ఉక్రెయిన్?
అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సాయంతోపాటు ఆయుధాలను సరఫరా చేస్తున్నదని రష్యా రాయబారి ఆరోపణ
సిరియాలో ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా రాయబారి ఉక్రెయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు చేస్తున్నాఆందోళనకు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సేవలు సాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా వ్యాఖ్యానించారు. కొంతమంది తిరుగుబాటుదారులు ఈ విషయాన్ని బహిరంగంగానే చాటింపు వేస్తున్నారని తెలిపారు.
బషర్ అల్ అసద్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు ఘర్షణకు దిగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇస్లామిక్‌గ్రూప్ హయత్ తహ్రీర్ అల్‌షామ్‌కు ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ సాయంతోపాటు ఆయుధాలను సరఫరా చేస్తున్నదని జెబెంజియా తెలిపారు. అంతేగాకుండా వారికి శిక్షణ కూడా ఇస్తున్నదని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు తిరుగుబాటుదారులపై రష్యా వైమానిక దాడులు చేస్తున్నట్లు అక్కడి అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
2011లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ ఉద్యమాన్ని అసద్ అణచివేయడానికి యత్నించడంతో అంతర్యుద్ధం మొదలైంది. ప్రభుత్వ దళాలు.. తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఈ పోరులో 6 లక్షల మందికిపైగా పౌరులు చనిపోయారు. నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి. రష్యా, ఇరాన్‌ల అండతో అసద్.. సిరియాలోని మెజారిటీ ప్రాంతాలపై పట్టు సాధించారు. గత రెండుమూడేళ్లుగా అంతర్యుద్ధం తీవ్రత తగ్గింది. తాజాగా మళ్లీ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పలు కీలక పట్టణాల పాటు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య భవనానలు తిరుగుబాటుదారులు అధీనంలోకి తీసుకున్నారు. సిరియాకు అండగా రష్యా రంగంలోకి దిగింది. ఇద్లట్, అలెప్పో నగరాలపై భారీస్థాయిలో వైమానిక దాడులు చేసింది. సిరియాలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు అసద్‌కు అండగా ఉంటామని మాస్క్ స్పష్టం చేసింది.