అమెరికాలో రోబో పోలీస్..! - గన్ కల్చర్‌కి చెక్ పెట్టేందుకు త్వరలో అమల్లోకి
అమెరికాలో రోజురోజుకూ పెరిగిపోతున్ననేరగాళ్ల అరాచకాలు, పెచ్చుమీరుతున్న వారి క్రిమినల్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ఇప్పుడు రోబో పోలీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
విశృంఖలంగా మారుతున్న గన్ కల్చర్‌కి చెక్ పెట్టేలా అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ కార్యకలాపాలకు దిగుతూ.. ప్రజలపై కాల్పులకు తెగబడుతూ ప్రాణాలు హరిస్తున్న నేరగాళ్లను శిక్షించేందుకు రోబో పోలీసులను ప్రవేశపెట్టనుంది.
అమెరికాలో రోజురోజుకూ పెరిగిపోతున్ననేరగాళ్ల అరాచకాలు, పెచ్చుమీరుతున్న వారి క్రిమినల్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ఇప్పుడు రోబో పోలీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదా ప్రణాళికను కూడా సిద్ధం చేశారు.
ఈ కొత్త ప్రతిపాదనలోని నిబంధనలపై శాన్‌ఫ్రాన్సిస్కో బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ కమిటీ వచ్చే వారం చర్చించనుంది. గత వారం వర్జీనియాలోని ఓ వాణిజ్య మాల్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు తాజా ప్రతిపాదనను పోలీసులు ముందుకు తెచ్చారు.
ప్రస్తుతం 17 రోబోలు పోలీసులకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 12 నిర్వహణలో ఉన్నాయి. మిగతావాటిని బాంబు తనిఖీలు, నిర్వీర్యానికి వినియోగిస్తున్నారు. ఇప్పుడు కాల్పులతో పెచ్చుమీరుతున్న నేరగాళ్లను చంపేందుకు రోబోలను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. మెషీన్ గన్లు, గ్రనేడ్ లాంచర్లతో వాటిని తీర్చిదిద్దాలని ముసాయిదాలో పేర్కొన్నారు. దీనిపై వచ్చేవారం జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.