Telugu Global
International

బ్రిటన్‌ ఎన్నికల్లో రిషి సునాక్‌ పార్టీ ఘోర పరాజయం

గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్‌ ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

బ్రిటన్‌ ఎన్నికల్లో రిషి సునాక్‌ పార్టీ ఘోర పరాజయం
X

బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి తాను బాధ్యత వహిస్తున్నట్టు ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ వెల్లడించారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్‌ ఐర్లాండ్‌ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరగగా, అధికారం దక్కించుకునేందుకు 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే ప్రతిపక్ష లేబర్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ని దాటేసి మరింత జోరుగా ముందుకు సాగుతోంది. మొత్తం 403 స్థానాలతో గెలుపు బాటలో నిలిచింది. ఇక కన్జర్వేటివ్‌ పార్టీ 109 స్థానాలు ఇప్పటివరకు దక్కించుకొంది. అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కి ఆ పార్టీ చాలా దూరంలోనే ఉంది.

రిషి సునాక్‌ తన సొంత నియోజకవర్గ రిచ్మండ్‌ అండ్‌ నార్తర్న్‌ అలర్టన్‌లో పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. తనను క్షమించాలని ఆయన కోరారు. ఓటమికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించారు. లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు సునాక్‌ అభినందనలు తెలియజేశారు. ఇక సునాక్‌ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు.

గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్‌ ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్‌ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌ పడిపోతూ వచ్చింది.

లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ తమ పార్టీ విజయంపై స్పందిస్తూ.. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన తన మద్దతుదారులతో మాట్లాడుతూ ప్రజల తీర్పు మనపై పెద్ద బాధ్యతను ఉంచిందని చెప్పారు. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలు పెడదాం.. అంటూ ఆయన పిలుపునిచ్చారు.

First Published:  5 July 2024 10:34 AM GMT
Next Story