భారత విద్యార్థులకు సునాక్ షాక్.. వలసలకు చెక్ పెట్టే ఆలోచన?
బ్రిటన్ ఎదుర్కుంటున్న వలసల సమస్యకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే జరిగితే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని అయ్యాడు. సునాక్ మావాడే అంటూ సంబరాలు చేసుకొని కొన్ని రోజులు కూడా కాలేదు. సొంత వ్యక్తే ప్రధాని అయినట్లు భారతీయులు పొంగిపోయారు. కానీ తాను బ్రిటన్ ప్రయోజనాల కోసమే పని చేస్తానని సునాక్ నిరూపించబోతున్నారు. బ్రిటన్ ఎదుర్కుంటున్న వలసల సమస్యకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే జరిగితే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్రిటన్‌లో నానాటికీ వలసదారుల సంఖ్య పెరిగిపోతోంది. పెద్దగా ప్రాధాన్యత లేని డిగ్రీలు, ఇతర కోర్సులు, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. 2021లో బ్రిటన్‌కు 1.73 లక్షల మంది వలస రాగా, 2022లో ఆ సంఖ్య ఇప్పటికే 5 లక్షలు దాటిపోయింది. ఇందులో ఎక్కువగా విద్యార్థులే ఉండటం గమనార్హం. గతంలో చైనాకు చెందిన విద్యార్థులు ఎక్కువగా వచ్చేవారు. కానీ ఇటీవల భారత విద్యార్థులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పుడు సునాక్ ప్రభుత్వం కనుక ఆంక్షలు విధిస్తే ఎక్కువగా భారత విద్యార్థులపై ప్రభావం పడుతుంది.
వలసల వ్యవస్థను పటిష్టం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాము. వలసదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రధాని సునాక్ పూర్తిగా కట్టుబడి ఉన్నారని పీఎం కార్యాలయ అధికార ప్రతినిధి మీడియాకు చెప్పారు. ముందుగా విద్యార్థులపైనే ఆంక్షలు ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. అయితే, ప్రాధాన్యత లేని డిగ్రీలు అంటే ఏమిటో బ్రిటన్ ప్రభుత్వం ఏలా నిర్ణయిస్తుందో మాత్రం ఆయన చెప్పలేదు. ఆయా కోర్సులకు విదేశీయులు అప్లై చేస్తే వారికి వీసా రాకకుండా నిరాకరిస్తారు.
భారతీయ విద్యార్థులను ఉద్దేశించి గతంలో మంత్రిగా పని చేసిన సుయోల్లా బ్రేవర్మన్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు బ్రిటన్‌కు రావడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఆమె సునాక్ కేబినెట్‌లో హోం మంత్రిగా ఉండటం గమనార్హం. సాధారణంగా బ్రిటన్ యూనివర్సిటీలు తమ దేశ విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు వసూలు చేస్తాయి. అదే సమయంలో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు విదేశీ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు రాబడతాయి. ఫీజులు ఎక్కువగా ఉన్నా.. నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని భారత్, చైనాకు చెందిన విద్యార్థులు ఎక్కువగా బ్రిటన్‌కు వెళ్తుంటారు. ఇప్పుడు ఆంక్షల నేపథ్యంలో ఈ రెండు దేశాలకు చెందిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.