ట్రంప్ పోటీలో లేకపోతే.. నేనూ వైదొలుగుతా.. - రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి
అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర రిపబ్లికన్ నేతలు రాన్ డిశాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఇదే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. లేదంటే ఈ చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు మౌనంగా సమర్థించిన వారవుతారని వివేక్ స్పష్టం చేశారు.
అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల్లో పోటీ చేయకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కొలరాడో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రిపబ్లికన్ పార్టీ నేత, అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పుల కారణంగా దేశంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ పోటీలో లేకపోతే.. తాను కూడా పోటీ నుంచి వైదొలుగుతానని ఆయన ప్రకటించారు. 2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి ట్రంప్ ప్రేరేపించిన కారణంగా.. కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై భారత సంతతి నేత వివేక్ రామస్వామి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రంప్‌ను పోటీ పడేందుకు అనుమతించకపోతే తాను కూడా కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర రిపబ్లికన్ నేతలు రాన్ డిశాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఇదే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. లేదంటే ఈ చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు మౌనంగా సమర్థించిన వారవుతారని వివేక్ స్పష్టం చేశారు.
ఇది బైడెన్ కుట్ర: ట్రంప్
కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా అధ్యక్షుడు జో బైడెన్ కుట్రేనని మండిపడ్డారు. ఎన్నికల పోటీ చేయకుండా తనను నిలువరించేందుకు జో బైడెన్, ఆయన సమూహం చేస్తున్న ఇలాంటి విపరీత చర్యలు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని ఆయన తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని తీవ్ర స్థాయిలో ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. జో బైడెన్ ప్రజాస్వామ్యానికి ముప్పు అని, రాబోయే ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిస్తామని వారికి తెలుసు కాబట్టే.. చట్ట సంస్థలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై తాము అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నట్టు ట్రంప్ అటార్నీ వెల్లడించింది.