డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ కేసుల్లో ఊరట
ట్రంప్‌పై గతంలో నమోదైన కేసులను కొట్టివేసిన న్యాయస్థానం
త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కోర్టు కొట్టివేసింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత వైట్‌హౌజ్ నుంచి రహస్యపత్రాలను తన దగ్గరే ఉంచుకున్న కేసుతోపాటు 2020 ఎన్నికల్లో ఓటమిని తిప్పికొట్టే ప్రయత్నాలకు సంబంధించిన కేసులను కోర్టు కొట్టివేసింది.అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌పై ఉన్న ఆ రెండు కేసులను కొట్టివేయాలని ఆయన తరఫున న్యాయవాది జాక్ స్మిత అభ్యర్థించగా.. న్యాయమూర్తి తాన్య చుట్కాన్ అంగీకరించారు. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయకూడదని అక్కడి న్యాయశాఖ నిబంధనల ప్రకారం న్యాయస్థానం కేసును కొట్టివేసింది. ఈ కేసు కొట్టివేయడం సముచితమని, ఈ కేసు అధ్యక్షుడిగా ఉన్నంత వరకు మాత్రమే పరిమితమని, బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే దాని గడువు ముగుస్తుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. అయితే తిరిగి నాలుగేళ్ల తర్వాత మళ్లీ విచారణకు స్వీకరించే అవకాశం ఉన్నది.
గత ఎన్నికల నాటి కేసు కొట్టి వేయడం పై స్పందించిన ట్రంప్ అది చట్టవిరుద్ధమైనదన్నారు. తనపై పోరాడానికి డెమోక్రాట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన వంద డాలర్లు వృథా చేశారని అన్నారు. గతంలో అమెరికాలో ఇలాంటివి జరగలేదని ట్రూత్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.