Telugu Global
International

ఇండియాలో డేంజర్లో ప్రజాస్వామ్యం..వారిని విడుదల చేయండి... 50 మంది కెనడియన్ మేధావుల లేఖ‌

భారత దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారని కెనడాకు చెందిన 50 మంది మేధావులు ఆ‍ందోళన వెలిబుచ్చారు. తీస్తా సెతల్వాద్, శ్రీ కుమార్ లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇండియాలో డేంజర్లో ప్రజాస్వామ్యం..వారిని విడుదల చేయండి... 50 మంది కెనడియన్ మేధావుల లేఖ‌
X

ఇండియాలో ప్రధాని మోడీ ప్రభుత్వ నిర్వాకం ప్రపంచదేశాలకు ఆగ్రహం కలిగిస్తోంది. భావ ప్రకటనా స్వేఛ్చకు వేస్తున్న సంకెళ్లు చూసి మేధావులు, రచయితలు, కవులు..న్యాయనిపుణులు..ఆర్టిస్టులు.. ఒకరేమిటి? సమాజ చైతన్యానికి నడుం కట్టినవర్గాలన్నీ ఒక్కటై ఇది తగదని హెచ్చరిస్తున్నాయి. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచున పడిందని ఘోషిస్తున్నాయి. ఇప్పటికైనా మేల్కొనాలని, ఈ స్వేచ్చకు విధించిన సంకెళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. సామాజిక కార్యకర్త తీస్తాసెతల్వాద్, గుజరాత్ మాజీ ఐపీఎస్ అధికారి శ్రీకుమార్ ల అరెస్టు అక్రమమని కెనడాకు చెందిన 50 మంది ప్రముఖులు ఖండించారంటే మోడీ ప్రభుత్వానికి ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. ఈ ఇద్దరినీ తక్షణమే విడుదల చేయాలంటూ వీరంతా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖలు రాశారు. గుజరాత్ లో 2002 లో జరిగిన అల్లర్ల కేసులో తీస్తాసెతల్వాద్, శ్రీకుమార్ లను 'సిట్' పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కెనడాకు చెందిన ఈ ప్రముఖులంతా ఒక్కటై నిరసన గళంతో నినదించారు. . . తీస్తా, శ్రీకుమార్ ల అరెస్టు చుట్టూ నెలకొన్న పరిస్థితులు, వారి నిర్బంధం చూస్తే లీగల్ ప్రాసెస్, పొలిటికల్ యాక్టివిజం రెండూ ఒకదానికొకటి మిళితమైనట్టు కనిపిస్తోందని వీరు తమ లేఖలో పరోక్షంగా ఆరోపించారు. అంటే న్యాయవ్యవస్థను రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

మీ దేశంలో డెమాక్రసీ సన్నగిల్లుతోంది. ఇలాంటి చర్యలు ఒక ప్రభుత్వాధినేతగా మీకున్న అంతర్జాతీయ ప్రతిష్టకు ముప్పుగా పరిణమింపజేస్తున్నాయి. మీ ప్రతిష్ట మసకబారుతోంది. ఇండియాకు దశాబ్దాల తరబడి సెక్యులర్, డెమాక్రాటిక్ రిపబ్లిక్ గా గల రెప్యుటేషన్ సర్వత్రా గౌరవింపబడుతున్న వేళ.. భారత రూల్ ఆఫ్ లా, సుప్రీంకోర్టు, ఇండియన్ జుడీషియరీకి ఉన్న అంతర్జాతీయ ప్రతిష్ట అందరి చేతా ప్రశంసింప బడుతున్న తరుణంలో ఈ విధమైన చర్యలు సమంజసం కావని వారన్నారు. భారత రాజ్యాంగ చరిత్ర గొప్పదన్న విషయం విస్మరించరాదన్నారు.

ఈ లేఖపై సంతకం చేసినవారిలో రైటర్ మార్గరెట్ అట్వుడ్, మానవ హక్కుల న్యాయవాది పెర్ల్ ఎలియాడిస్, ఇంకా మేధావులు నవోమీ క్లీన్, పీటర్ ల్యూరెచ్ట్, జ్యూడీ రెబిక్, యావర్ హమీద్, రోహింటన్ మిస్త్రీ. మీనాక్షీ గంగూలీ వంటి వారెందరో ఉన్నారు.

మానవ హక్కులను రక్షించాలనడం నేరం కాబోదని, ఈ అరెస్టులు గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయం జరగాలని కోరుతున్నవారిని శిక్షించడమేనని, దక్షిణాసియా మానవ హక్కుల సంస్థ డైరెక్టర్ మీనాక్షీ గంగూలీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రముఖ కెనడియన్లంతా మీ చర్యలను ఎండగడుతున్నారనడానికి ఈ లేఖలే నిదర్శనమని పెర్ల్ ఎలియాడిస్.. ఈ నెల 21 న జరిగిన ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. దమనకాండను అణచడానికి అంతర్జాతీయ సమాజమంతా ఒక్కటవుతున్నదని గ్రహించాలని ఆయన అన్నారు. ఇందుకు ప్రభుత్వాలే జవాబుదారీ వహించాలి.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని అన్ని దేశాలూ గుర్తించి ఖండిస్తాయి.. అని ఆయన చెప్పారు. తీస్తాసెతల్వాద్, శ్రీకుమార్ లను వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండును ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి హాజరయిన వారంతా ఏకగ్రీవంగా సమర్థించారు. ఈ ఇద్దరి అరెస్టుపై తామంతా ఆందోళన చెందుతున్నామని, ఈ లేఖలను వెంటనే పరిశీలించి వారిని విడుదల చేయాలని కోరుతున్నామని భారత రాష్ట్రపతికి, చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖల్లో విజ్ఞప్తి చేశారు.




First Published:  23 July 2022 5:32 AM GMT
Next Story