Telugu Global
International

శ్రీలంక అధ్య‌క్షుడిగా ర‌ణిల్ విక్రమసింఘే విజ‌యం

ఆర్థిక సంక్షోభం, ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంక లో ఎట్టకేలకు ప్రశాంతంగా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే దేశాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

శ్రీలంక అధ్య‌క్షుడిగా ర‌ణిల్  విక్రమసింఘే విజ‌యం
X

బుధ‌వారంనాడు శ్రీ‌లంక అద్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, రణిల్ విక్రమసింఘే విజ‌యం సాధించారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశం అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ జ‌రిగింది. బుధవారం ఉదయం రహస్య ఓటింగ్ ద్వారా పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 225 మంది ఎంపీల్లో 223 మంది ఓట్లు వేయగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. మొత్తం 219 ఓట్లు చెల్లుబాటు కాగా నాలుగు ఓట్లు చెల్ల‌లేదు.

విక్ర‌మ సిం|ఘేకు 134 ఓట్లు రాగా ప్ర‌త్య‌ర్ధులు శ్రీలంక పొదుజన పెరమున పార్టీ (ఎస్ ఎల్ పిపి) అభ్య‌ర్ధి డల్లాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు, వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ)కి చెందిన అనుర కుమార దిసానాయకకు మూడు ఓట్లు వచ్చాయి. దీంతో దుల్లాస్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా నిలిచారు. ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే గ‌తంలో ఆరు సార్లు ప్ర‌ధాన మంత్రిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం దేశాన్ని సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించ‌డ‌మే త‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని అధికారం చెలాయించ‌డం కాద‌ని సింఘే అన్నారు.

దాదాపు 22 మిలియన్ల జ‌నాభా ఉన్న శ్రీలంక ఏడు ద‌శాబ్దాల‌లో ఎన్న‌డూ లేనంత దారుణ‌మైన‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది, లక్షలాది మంది ఆహారం, మందులు, ఇంధనం , ఇతర నిత్యావసర వస్తువులకు కూడా క‌ట‌క‌టలాడారు. దీంతో దేశంలో ప‌రిస్థితుల‌కు పాల‌కులే కార‌ణ‌మ‌న్న రీతిలో ప్ర‌జ‌లు రోడ్డెక్కి ఆందోళ‌న‌లు చేశారు. చివ‌రికి ఇవి తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీశాయి. ప్ర‌ధాని, అధ్య‌క్షుడు రాజీనామాలు చేయాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేశారు. ఇది రాజ‌కీయ సంక్షోభానికి కార‌ణ‌మైంది.

విక్రమసింఘే జులై 13న శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు, కొద్దిరోజుల తర్వాత అతని నివాసంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత వారం దేశం విడిచి పారిపోయి రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సేకు వ్యతిరేకంగా వారాలపాటు ప్రజా తిరుగుబాటు జరిగిన తర్వాత ఎన్నికలు జరిగాయి.

విక్రమసింఘే గతంలో ఆరుసార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. 225 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో 145 మంది స‌భ్యుల‌తో మెజారిటీలో ఉన్న రాజపక్సేల శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ ఎల్ పిపి) పార్టీ లో ఒక వ‌ర్గం మద్దతు విక్రమసింఘేకు ఉండ‌డంతో ఆయ‌న గెలుపు సునాయాస‌మైంది.

ప్రతిపక్ష నాయకుడు, సమగి జన బలవేగయ (ఎస్ జెబి) అధినేత సజిత్ ప్రేమదాస మంగళవారం అధ్యక్ష రేసు నుండి వైదొలిగి అలహప్పెరుమకు మద్దతు ప్రకటించారు. ఎన్నిక‌ల ప‌లితాలు ఎలా ఉన్నాసంక్షోభంలో చిక్కుకున్న త‌మ మాతృభూమికి స‌హాయ స‌హాకారాలు అందించాల‌ని ప్ర‌ధాని మోడీ,తోపాటు అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌కు, ప్ర‌జ‌ల‌కు ప్రేమ‌దాస ఎన్నిక‌లు ప్రారంభానికి ముందు విజ్ఞ‌పి చేశారు.

"ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప‌రిధిలో శ్రీలంకలో రాజకీయ, స‌మ‌స్య‌ల పరిష్కారానికి మద్దతు ఇస్తుంది" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది

First Published:  20 July 2022 2:31 PM IST
Next Story