Telugu Global
International

బ్రిట‌న్ లో రికార్డు స్థాయిలో ద్ర‌వ్యోల్బ‌ణం- మ‌రోసారి స‌మ్మెకు దిగిన రైల్వే కార్మికులు

బ్రిటన్ లో రైల్వే కార్మికులు సమ్మెకు దిగారు. దేశంలో ద్ర‌వ్యోల్బణం పెరుగుద‌ల వారి వేత‌నాలు, జీవ‌న ప్ర‌మాణాల‌పై తీవ్ర ప్ర‌బావం చూపుతుండటంతో వేతనాల పెంపుకోసం వాళ్ళు సమ్మె చేపట్టారు.

బ్రిట‌న్ లో రికార్డు స్థాయిలో ద్ర‌వ్యోల్బ‌ణం- మ‌రోసారి స‌మ్మెకు దిగిన రైల్వే కార్మికులు
X

బ్రిట‌న్ లో సంక్షోభం ముదురుతోంది. అధిక ద్ర‌వ్యోల్బ‌ణంతో కార్మికులు ఆందోళ‌న చెందుతున్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల వారి వేత‌నాలు, జీవ‌న ప్ర‌మాణాల‌పై తీవ్ర ప్ర‌బావం చూపుతోంది. గురువారంనాడు రైల్వే కార్మికులు మ‌రోసారి స‌మ్మెకు దిగ‌డంతో దేశ‌వ్యాప్తంగా రైలు స‌ర్వీసులు స్తంభించాయి. బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌వుతున్న త‌రుణంలో వేత‌నాలు స‌క్ర‌మంగా అంద‌క‌పోవ‌డం, ప‌ని పరిస్థితులు కార‌ణంగా వారు మ‌రోసారి స‌మ్మెకు దిగారు.


యూనియ‌న్ స‌భ్యులంతా స‌మ్మెలో దిగ‌డంతో ఐదింటిలో ఒక రైలు మాత్ర‌మే తిరిగింది. వేత‌నాలు స‌రిపోవ‌డంలేద‌ని ఇప్ప‌టికే వారు ప‌లు సార్లు స‌మ్మె చేశారు. శుక్ర శ‌నివారాల్లో కూడా వారు స‌మ్మె కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించ‌డంతో లండ‌న్‌ అండ‌ర్ గ్రౌండ్ స‌బ్‌-వే వ్య‌వ‌స్థ‌తో పాటు దేశ వ్యాప్తంగా బ‌స్సు స‌ర్వీసుల‌కు అంత‌రాయం ఏర్ప‌డనున్న‌ది. ఆహార‌, ఇంధ‌న ధ‌ర‌లు పెర‌గ‌డంతో ప‌బ్లిక్ రంగంలోని కార్మికులు, ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎద‌ర్కొంటున్నార‌ని స‌ముద్ర‌, రావాణా కార్మిక సంఘ నాయ‌కుడు మైక్ లించ్ చెప్పారు.


గ‌త‌ 40 యేళ్ళ‌లో ఎన్న‌డూ లేని విధంగా ద్ర‌వ్యోల్బ‌ణం 10.1 శాతానికి పెరిగింద‌ని, ఇది విశ్లేష‌కుల 9.8 శాతం అంచానాల‌ను మించిపోయింద‌ని బుధ‌వారంనాడు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. దీనిపై లించ్ స్పందిస్తూ.. త‌మ‌కు స‌రైన ప‌ని ప‌రిస్థితులు క‌ల్పించి ఈ దుర్భ‌ర ప‌రిస్థితుల్లో జీవ‌న వ్య‌యాల‌ను త‌ట్టుకునేలా వేత‌నాలు చెల్లించాల‌న్న‌ డిమాండ్ తో అన్ని రంగాల కార్మిక సంఘాలు, ఉద్యోగులు సంఘీభావంతో ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు.

అధిక ద‌ర‌లు జీవ‌న వ్య‌యాన్ని పెంచ‌డంతో వేత‌నాలు స‌రిపోవ‌డంలేద‌ని పోస్ట‌ల్, పోర్టులు, ఏవియేష‌న్ వ‌ర్క‌ర్ల సంఘాల‌ యూనియ‌న్ కూడా స‌మ్మెకు దిగుతామ‌ని హెచ్చ‌రించింది. స్కాట్ ల్యాండ్‌, ఎడిన్ బ‌ర్గ్ లోనూ చెత్త ఏరుకునే, రీ సైక్లింగ్ వ‌ర్క‌ర్లు కూడా గురువారం నుంచి 11 రోజుల పాటు స‌మ్మె ప్రారంభించారు. వారికి 3.5 శాతం మాత్ర‌మే వేత‌నం పెంచ‌డంతో ఇది క‌నీసం బిల్లులు చెల్లించ‌డానికి కూడా స‌రిపోద‌ని నిర‌సిస్తూ స‌మ్మెకు దిగారు. త‌క్కువ వేత‌నాల‌తో దేశంలో ప్ర‌జ‌లంతా విసిగి పోయారు. ఎంతోమంది ద‌శాబ్దాలుగా స‌రైన వేత‌నాలు పొంద‌లేక‌పోతున్నార‌ని లించ్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ ప‌రిస్థితుల‌పై తీవ్ర‌మైన అసంతృప్తి చెల‌రేగి ప్ర‌జ‌లు రోడ్లెక్కి ఆందోళ‌న‌లు చేసే ప్ర‌మాదం క‌న‌బ‌డుతోంది.

First Published:  19 Aug 2022 12:00 PM IST
Next Story