Telugu Global
International

ప్రేయసిని కసిదీరా 111 సార్లు పొడిచి చంపిన వ్యక్తికి పుతిన్‌ క్షమాభిక్ష.. ఎందుకంటే

ఖైదీల్లో ఆరోగ్యంగా ఉండి తుపాకీ పట్టుకోగల సామర్థ్యం ఉన్నవారిని గుర్తించి వారిని ఉక్రెయిన్‌పై యుధ్దానికి పంపుతోంది ర‌ష్యా. ఇందులో భాగంగానే వ్లాడిస్లావ్‌ని జైలు నుంచి విడుదల చేశారు.

ప్రేయసిని కసిదీరా 111 సార్లు పొడిచి చంపిన వ్యక్తికి పుతిన్‌ క్షమాభిక్ష.. ఎందుకంటే
X

ప్రియురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఓ వ్యక్తికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రేకప్ చెప్పిందన్న కారణంతో వ్లాడిస్లావ్ కాన్యుస్‌ అనే యువకుడు తన ప్రియురాలు వెరా పెఖ్తెలేవాను 111 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. అత్యాచారానికి పాల్పడడంతో పాటూ మూడున్నర గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చివరకు ఆమె గొంతు కోసేసి చంపేశాడు. 2020లో సైబీరియాలో జరిగిన ఈ దారుణంపై మృతురాలి తల్లి ఒక్సానా ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వ్లాడిస్లావ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేరంలో అతనికి 17 ఏళ్ల శిక్ష పడింది.


గత కొంత కాలంగా రష్యా ఉక్రెయిన్‌పై సైనిక దాడులు నిర్వహిస్తోంది. సైన్యంతో పాటు వాగ్నర్ గ్రూప్, జైళ్లలో ఉన్న ఖైదీలను కూడా రష్యా యుద్ధం కోసం వినియోగిస్తోంది. ఖైదీల్లో ఆరోగ్యంగా ఉండి తుపాకీ పట్టుకోగల సామర్థ్యం ఉన్నవారిని గుర్తించి వారిని యుద్ధ రంగానికి పంపుతోంది. ఇందులో భాగంగానే వ్లాడిస్లావ్‌ని జైలు నుంచి విడుదల చేశారు. దీంతో కనీసం ఒక్క సంవత్సరం కూడా శిక్ష అనుభవించకుండానే పుతిన్ పెట్టిన క్షమాభిక్షతో కాన్యుస్‌ బయటకు వచ్చిన విషయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సైనిక దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న అత‌డి ఫొటోలు చూసి మృతురాలి తల్లి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చూస్తే తన కుమార్తె ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. రష్యాను రక్షించడానికి అలాంటి క్రూరుడికి ఆయుధాన్ని ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.


వ్లాడిస్లావ్‌ను జైలు నుంచి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతం దక్షిణ రష్యాలోని రొస్తొవ్‌కు పంపినట్టు జైలు అధికారులు ధ్రువీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అల్యోనా పొపొవా తెలిపారు. కాన్యుస్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్టు చెప్పే నవంబర్ 3వ తేదీతో ఉన్న రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసు లేఖను పొపొవా షేర్ చేశారు. ఏప్రిల్ 27న కాన్యుస్‌కు ప్రెసిడెన్షియల్ డిక్రీ లభించినట్టు ఆ లేఖ తెలుపుతుందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సమర్థించుకున్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులు రక్తంతో తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని మీడియా సమావేశంలో తెలిపారు.

First Published:  11 Nov 2023 9:29 PM IST
Next Story