అమెరికా శత్రువు స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం ఇచ్చిన పుతిన్
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ 72 మంది విదేశీయులకు పౌరసత్వం కల్పిస్తున్న ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో స్నోడెన్‌కు పూర్తి పౌరసత్వం లభించింది.
అగ్రరాజ్యం అమెరికా నిఘా రహస్యాలను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పించింది. పుట్టుకతో అమెరికన్ అయిన స్నోడెన్.. అమెరికా నిఘా వ్యవస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ)కు కాంట్రాక్టర్‌గా వ్యవహరించాడు. 2013లో ఎన్ఎస్ఏ నిర్వహిస్తున్న స్వదేశీ, విదేశీ నిఘాలకు సంబంధించిన అత్యంత సీక్రెట్ ఫైల్స్‌ను స్నోడెన్ బహిర్గతం చేశాడు. అంతర్జాతీయంగా పలు దేశాలు, నాయకులపై చేసిన నిఘాకు సంబంధించిన డేటాను, అందుకు ఉపయోగించి కమ్యునికేషన్ వ్యవస్థను స్నోడెన్ వెల్లడించాడు. ఆ తర్వాత అమెరికా నుంచి పారిపోయి రష్యాలో రాజకీయ శరణార్థిగా నివసిస్తున్నాడు.
అమెరికా ప్రభుత్వం స్నోడెన్‌పై గూఢచర్య ఆరోపణలు మోపింది. ఆయనను ఒక శత్రువులా చూస్తోంది. క్రిమినల్ విచారణను ఎదుర్కునేందుకు స్వదేశం తిరిగి రావాలని అమెరికా కోరుతోంది. కాగా, అమెరికాలో అడుగుపెడితే తనను దారుణంగా శిక్షిస్తారని, అనవసరమైన కేసులు బనాయిస్తారని స్నోడెన్ అక్కడకు వెళ్లడం లేదు. రష్యాలోనే దాదాపు దశాబ్దం నుంచి గడుపుతున్న స్నోడెన్ వద్దకు ఆయన గర్ల్ ఫ్రెండ్స్ లిండ్సే మిల్స్ కూడా వచ్చింది. 2020లో స్నోడెన్‌కు రష్యా ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించింది. రష్యాన్లకు లభించే అన్ని హక్కులు ఇకపై స్నోడెన్‌కు కూడా ఉంటాయని ప్రకటించింది. అప్పుడే ఆయనకు పౌరసత్వం లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి.
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ 72 మంది విదేశీయులకు పౌరసత్వం కల్పిస్తున్న ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో స్నోడెన్‌కు పూర్తి పౌరసత్వం లభించింది. దీంతో పాటు ఆయన భార్య లిండ్సే మిల్స్ కూడా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇక వీరిద్దరి పిల్లలు రష్యాలోనే జన్మించారు. దీంతో వీరికి స్వతహగానే రష్యా పౌరసత్వం లభించనుంది.
కాగా, ఎడ్వర్డ్ స్నోడెన్‌ను రష్యా మిలటరీలో కీలకమైన పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఉక్రెయిన్ యుద్దం కారణంగా అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడిన రష్యా.. తమ మిలటరీ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో స్నోడెన్‌కు పౌరసత్వం ఇచ్చి మిలటరీలో కీలక పోస్టు కట్టబెడతారనే ప్రచారం జరిగింది. కానీ, రష్యా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆ ప్రచారాన్ని పూర్తిగా ఖండించాయి. రాజకీయ శరణార్థిగా వచ్చిన వ్యక్తి తిరిగి తన దేశానికి వెళ్లే పరిస్థితులు లేవని, ఈ క్రమంలో స్నోడెన్ దరఖాస్తు చేసుకోవడం వల్లే పౌరసత్వం ఇచ్చామని స్పష్టం చేస్తున్నారు.
ఎడ్వర్డ్ స్నోడెన్ రష్యాలో ఉండటం వల్ల తమ దేశానికి వచ్చే ప్రమాదం, నష్టం లేదని 2017లో పుతిన్ వ్యాఖ్యానించారు. అమెరికా రహస్యాలను బహిర్గతం చేయడం స్నోడెన్ చేసిన తప్పే.. కానీ ఆయన దేశద్రోహి కాదని అన్నారు.