Telugu Global
International

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ

ఇండో-పసిఫిక్‌ దేశాలకు 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లు.. క్వాడ్‌ సమ్మిట్‌లో మోడీ

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ
X

అమెరికా పర్యటనలో భాగంగా మొదట ఫిలాడెల్ఫియా విమానాశ్రయంలో దిగిన ప్రధాని నరేంద్రమోడీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వెలుపల ప్రవాస భారతీయులతో ప్రధాని మాట్లాడారు. క్వాడ్‌ సదస్సు కోసం అమెరికా వెళ్లిన ప్రధాని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్‌, గాజా-ఇజ్రాయెల్‌ యుద్ధాలపై ఇరువురు నేతలు చర్చించారు. పలు ద్వైపాక్షిక అంశాలపై మాట్లాడుకున్నారు. బైడెన్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించినట్లు ప్రధాని తెలిపారు. చర్చలు ఫలప్రదమైనట్లు భేటీ అనంతరం ప్రధాని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

డెలావేర్‌లోని గ్రీన్‌విల్లేలోఓని బైడెన్‌ నివాసంలో తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్‌తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎన్నడూలేనంత బలమైంది, సన్నిహితమైంది, చైతన్యవంతమైనందని బైడెన్‌ పేర్కొన్నారు. ప్రధాని మోడీ, తాను చర్చలకు కూర్చున్న ప్రతీసారి కొత్త సహకార రంగాలను కనుక్కోగల ఇరు దేశాల సామర్థ్యాన్ని చూసి తాను ఆశ్చర్యపోతున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు. సమావేశానికి ముందు బైడెన్‌ ప్రధాని మోడీని ఆలింగం చేసుకున్నారు. ఆయనను ఆత్మీయంగా చేతులు పట్టుకుని తన ఇంట్లోకి తీసుకువెళ్లి చర్చలు జరిపారు.

క్వాడ్‌ సదస్సు కోసం అమెరికా వెళ్లిన మోడీ విడివిడిగా జపాన్‌, ఆస్ట్రేలియా ప్రధానులతో భేటీ అయ్యారు. ఇండో-పసిఫిక్‌ రిజియన్‌ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్పనీస్‌తో భేటీ అయిన ప్రధాని మోడీ విస్తృతమైన చర్చలు జరిపారు. వాణిజ్యం, భద్రత, అంతరిక్ష రంగం, కల్చర్‌ వంటి రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాం. కాలపరీక్షను తట్టుకుని నిలబడిన ఆస్ట్రేలియా స్నేహాన్ని భారత్‌ ఎంతో గౌరవిస్తుందని మోడీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు మోడీ భేటీ అనంతరం భారత్‌-ఆస్ట్రేలియా దైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్పనీస్‌ అన్నారు.

40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లు కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో ఆశాకిరణం

క్వాడ్‌ సమ్మిట్‌లో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ అక్కడ నిర్వహించిన క్యాన్సర్‌ మూన్‌ షాట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..ఇండో-పసిఫిక్‌ దేశాలకు 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందించి క్యాన్సర్‌ పోరాటానికి సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లు కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో ఆశాకిరణంగా మారుతాయి. ఒక దేశం.. ఒక ఆరోగ్యం అనేది భారత్‌ లక్ష్యం. అందుకే మూన్‌షాట్‌ చొరవ కింద 7.5 మిలియన్‌ డాలర్ల విలువైన నమూనా కిట్‌లు, డిటెక్షన్‌ కిట్‌లటో పాటు వ్యాక్సిన్‌ల మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అధ్యక్షుడు బైడెన్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  22 Sept 2024 3:36 PM IST
Next Story