విమానం గాల్లో ఉండగానే.. తెరుచుకున్న డోర్.. - ఓ ప్రయాణికుడి నిర్వాకం
విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులు అతన్ని అడ్డుకునేందుకు యత్నించారు.
అది 194 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం.. ఆకాశంలో ఉండగానే ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుంది. దీంతో కేబిన్‌లోకి భారీగా గాలులు వీచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇష్టదైవాలను ప్రార్థిస్తూ సీట్లనే అంటిపెట్టుకుని కూర్చున్నారు. ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే..
దక్షిణ కొరియాకు చెందిన ఏసియానా ఎయిర్‌లైన్స్ విమానం జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి బయలుదేరింది. సుమారు గంట ప్రయాణం ఉంటుంది. అయితే విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులు అతన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే అప్పటికే డోర్ తెరుచుకుంది. దీంతో గాలి లోపలికి చొరబడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విపరీతమైన గాలుల వల్ల ప్రయాణికుల్లో కొందరికి శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. చివరికి ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు..
డోర్ తెరిచినట్టు భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యకు పాల్పడటం వెనుక అతని ఉద్దేశమేమిటనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఏసియానా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ పరిణామంతో విమాన ప్రయాణికులు భయాందోళనకు గురైనప్పటికీ.. ఎవరికీ గాయాలు కాలేదని ఏసియానాతో పాటు అక్కడి రవాణా శాఖ ప్రకటించాయి. ప్రయాణికుల్లో కొందరు ఈ ఘటనను ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.