కరోనా వైరస్ తరహా తీవ్రతతో మరో మహమ్మారి..!
మెర్స్, జికా వంటి వ్యాధులను అడ్డుకునేందుకు సరైన వ్యాక్సిన్లు, చికిత్స పద్ధతులు అందుబాటులో లేవని ఎయిర్‌ఫినిటీ సంస్థ స్పష్టం చేసింది.
కరోనా వైరస్.. ప్రపంచాన్ని చుట్టుముట్టి లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి.. ఇంకా అక్కడక్కడ కొత్త రూపు సంతరించుకుంటూ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని జాడలు ఇంకా కొనసాగుతుండగానే.. లండన్ కేంద్రంగా చేపట్టిన ఓ పరిశోధన మరో ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. కరోనా అంత తీవ్రమైన మరో మహమ్మారి రానున్న పదేళ్ల కాలంలో ప్రపంచాన్ని చుట్టుముట్టే అవకాశముందని తెలిపింది. అందుకు 27.5 శాతం అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ఆరోగ్య విశ్లేషణ సంస్థ `ఎయిర్ ఫినిటీ లిమిటెడ్` ఈ పరిశోధన చేపట్టింది. వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడం, జనాభా పెరుగుదల, జంతువుల నుంచి మనుషులకు సోకే కొత్త వ్యాధులు పుట్టుకురావడం వంటి కారణాలు దీనికి దోహదం చేసే అవకాశముందని ఈ సంస్థ పేర్కొంది. దానిని గుర్తించిన వంద రోజుల్లోగా సమర్థమంతమైన వ్యాక్సిన్‌ను రూపొందిస్తే దానిని నివారించే అవకాశముంటుందని తెలిపింది.
మెర్స్, జికా వంటి వ్యాధులను అడ్డుకునేందుకు సరైన వ్యాక్సిన్లు, చికిత్స పద్ధతులు అందుబాటులో లేవని ఎయిర్‌ఫినిటీ సంస్థ స్పష్టం చేసింది. ఏదేమైనా మరో కొత్త మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సన్నద్ధంగా ఉండాలని తేల్చి చెప్పింది.