ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా పౌరుల ప్రాణాలు బలి
ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 42 వేల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ వెల్లడి
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కొన్నిరోజులుగా భీకర యుద్ధం కొనసాగుతున్నది. హెజ్‌బొల్లా కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా గాజాలోని జబాలియా ప్రాంతంలో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 49 మంది పాలస్థీనియన్లు మృతి చెందారు.
ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో వేలామంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో జరిపిన దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో నివాసితులు ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లకుండా గాజాలోని హమాస్ అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సురక్షితమనుకున్న ప్రాంతాల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం తమ పౌర ప్రాంతాలను స్థావరాలుగా ఉపయోగించడాన్ని హమాస్ ఖండించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 42 వేల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ వెల్లడించింది.