అన్నదమ్ముల అనుబంధం: జనగణమన గీతం వినిపించిన పాకిస్తానీ కళాకారుడు
ఓపాకిస్తాన్ కళాకారుడు భారత ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన వాయిద్యంతో జనగణమన వాయించి భారత ప్రజలను ఫిదా చేశారు.
భారత్ , పాకిస్తాన్ ప్రజల మధ్య శతృత్వం ఉందా ? ఉంటే ఎందుకుంది ? నిజానికి రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వానికి ప్రజలకు ఏం సంబంధం ఉంది. ఆ శతృత్వానికి ప్రజలు కారణం కాదుకదా ! భారత దేశ ప్రజలు ఎంత మంచివాళ్ళో పాకిస్తాన్ ప్రజలు కూడా అంతే మంచివాళ్ళు. అసలు ఏ దేశమైనా సాధారణ ప్రజలందరికి ఇతరుల పట్ల శత్రుత్వం ఎందుకుంటుంది ? వాళ్ళు హింసను ఎందుకు కోరుకుంటారు? వాళ్ళెప్పుడూ యుద్దాలు కోరుకోరు. ఒకరి నాశనాన్ని కోరుకోరు. అందులోనూ మొన్నటి వరకు కలిసి ఉన్న వాళ్ళం... కొందరి కుట్రల కారణంగా విడిపోయిన అన్నదమ్ములకు ఒకరిమీద మరొకరికి ఎంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ, ఆప్యాయతలను అనేక సార్లు రెండు దేశాల ప్రజలు రుజువు చేస్తూనే ఉన్నారు. కాని ఆ ప్రేమను సహించని రాజకీయ నాయకులు వారి మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు దేశాల నాయకులు ప్రజలను ఎప్పుడూ విడగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయినా సియాల్ ఖాన్ వంటి మనుషులు ధైర్యంగా తమ ప్రేమను పంచుతారు. సోదర దేశ ప్రజలపై తమకున్న ఆప్యాయతను వెల్లడిస్తూ ఉంటారు.
ఆగస్ట్ 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన రబాబ్ అనే వాయిద్యంతో (తంబూర లాంటి ఈ వాయిద్యం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్ లలో ప్రసిద్ది చెందింది) సియాల్ ఖాన్ భారత జాతీయ గీతం 'జనగణమన'ను అద్భుతంగా ప్లే చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. భారత ప్రజలపై సంగీతం సహాయంతో ఆయన చూపిన ప్రేమ పట్ల నెటిజన్ల నుండి భారీ స్పందన వస్తోంది.
అతను తన వీడియోను పోస్ట్ చేస్తూ "సరిహద్దు ఆవల ఉన్న నా వీక్షకులకు ఇది నా బహుమతి.'' అని కామెంట్ చేశారు. ''భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన మధ్య శాంతి, సహనం, సత్సంబంధాల కోసం, స్నేహం, సద్భావనకు చిహ్నంగా నేను భారతదేశ జాతీయ గీతాన్ని ప్రయత్నించాను. #IndependenceDay2022 ," అని కామెంట్ చేశారాయన.
ఈ వీడియో రెండు దేశాల్లో నెటిజనులు విపరీతంగా షేర్లు చేస్తున్నారు. 24 గంటల్లో 10 వేల మంది ఈ పోస్ట్ ను రీ ట్వీట్ చేశారు. మిలియన్ కు పైగా వ్యూస్, 65 వేల లైక్ లు వచ్చాయి.
చాలా మంది భారతీయులు అతని మంచితనానికి ధన్యవాదాలు తెలిపారు. వారిలో ఒకరు ఇలా వ్రాశారు, "అతను చాలా ప్రతిభావంతుడైన కళాకారుడు.అతను ఇక్కడ వాయించే వాయిద్యాన్ని రబాబ్ అని పిలుస్తారు మరియు ఈ రబాబ్ పాష్టో సంగీతంలో అతను బాగా ప్రాచుర్యం పొందాడు."
మరొకరు, "భారత పౌరుడి నుండి మీకు ధన్యవాదాలు. మీ నాయకత్వం, గూఢచార సంస్థ భారతదేశంతో స్నేహం కోరుకునే మీ లాంటి పాకిస్తానీ ప్రజల హృదయాన్ని వినాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
Here's a gift for my viewers across the border. pic.twitter.com/apEcPN9EnN
— Siyal Khan (@siyaltunes) August 14, 2022
ఈనెటిజనుడి కోరికలో న్యాయముంది. అతని కోరికను పాకిస్తాన్ పాలకులు వినాలని, అతని కోరికను తీర్చాలని కోరుకుందాం . అయితే అక్కడితో ఆగకుండా భారత పాలకులు కూడా పాకిస్తాన్ ప్రజలను ప్రేమించే భారత ప్రజల హృదయాలను వినాలని కోరుకుందాం.