Telugu Global
International

ఆర్థిక సంక్షోభం, ఆహారం కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్ పై మరో పిడుగు

పాకిస్తాన్ లో ఇంధనం నిలువలు అయిపోవచ్చాయి. మరో వారంరోజుల్లో పాకిస్తాన్ కు ఇంధనంకూడా కరువయ్యే పరిస్థితి ఉంది. విదేశాల నుండి ఇంధనం కొనడానికి పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు లేవు.

ఆర్థిక సంక్షోభం, ఆహారం కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్ పై మరో పిడుగు
X

ఆర్థిక సంక్షోభం, ఆహారం కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్ పై మరో పిడుగు పడబోతోంది. ఇప్పటి కే గోదుమ పిండి కొరతతో దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి. రోజూ ఏదో ఓ చోట గోదుమపిండి కోసం ప్రజల మధ్య కొట్లాటలు, తొక్కిసలాటలు జరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ లో ఇంధనం నిలువలు అయిపోవచ్చాయి. మరో వారంరోజుల్లో పాకిస్తాన్ కు ఇంధనంకూడా కరువయ్యే పరిస్థితి ఉంది. విదేశాల నుండి ఇంధనం కొనడానికి పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు లేవు. మరో వైపు పాకిస్తానీ రూపాయి విలువ దారుణంగా పడిపోవడం వల్ల ఇతర దేశాల నుండి వస్తువులను కొనుగోలు చేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.

పాకిస్తాన్ సాధారణంగా దాని వార్షిక విద్యుత్ డిమాండ్‌లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా దిగుమతి చేసుకున్న సహజ వాయువును ఉపయోగిస్తుంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఈ గ్యాస్ ధర పెరిగింది.

"ఈ పది రోజుల్లో ఎటువంటి కొరత లేదు. కానీ ఆ తర్వాత‌ కొరత తీవ్రంగా ఉంటుంది." అని చమురు కంపెనీలలో ఒక సీనియర్ అధికారి రాయిటర్స్‌తో అన్నారు.

మరో వైపు అప్పు కోసం పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో చర్చలు జరుపుతోంది. ఆగిపోయిన బెయిలౌట్ ప్యాకేజీని తిరిగి తెరవాలని కోరుతోంది. చర్చల నేపథ్యంలో IMF పెట్టిన షరతుల మూలంగా పాకిస్తాన్ పెట్రోల్ , డీజిల్ రేట్లను 16 శాతం పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటరు పెట్రోలు 249.80 రూపాయలకు చేరుకుంది.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇవ్వాల్సిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LC) ఇవ్వకపోవడం వల్ల రావాల్సిన ఇంధనం కూడా రాకుండా ఆగిపోయింది.

పాకిస్తాన్ లో ఉన్న డిమాండ్ మేరకు ఆ దేశం ప్ర‌తి నెలా 4,30,000 టన్నుల గ్యాసోలిన్, 2,00,000 టన్నుల డీజిల్ మరియు 6,50,000 టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోవాలి. అందుకు ప్రతి నెల 1.3 బిలియన్ డాలర్ల‌ వ్యయం అవుతుంది.

కానీ అవసరమైనంత ఇంధనాన్ని పాక్ కొనుగోలు చేయలేకపోతోంది. డిసెంబర్‌లో 2,23,000 టన్నుల గ్యాసోలిన్‌ను మాత్రమే కొనుగోలు చేసింది. 2021 డిశంబర్ లో 6 లక్షల టన్నుల పెట్రోల్ ను దిగుమతి చేసుకున్న పాకిస్తాన్ 2022 డిశంబర్ లో 2.2 లక్షల టన్నుల పెట్రోల్ మాత్రమే దిగుమతి చేసుకోగలిగింది.

ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే వారం, పది రోజుల్లో పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

First Published:  1 Feb 2023 9:46 AM IST
Next Story