పాక్‌లో లీటర్ పాల ధర రూ.370.. - ఐఎంఎఫ్ నిబంధనల వల్లే..
బెయిలవుట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విధించిన షరతులను అందుకోవడంలో భాగంగా పాకిస్తాన్ ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచింది.
పాకిస్తాన్‌లో పాల ధర ఒక్కసారిగా చుక్కలనంటింది. లీటర్ ధర రూ.370కి చేరింది. పాక్ పౌరులు ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతుండగా.. అక్కడి ప్రభుత్వం కొత్తగా పాలపై పన్ను విధించింది. దీంతో స్థానికంగా పాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కంటే పాల ధరలు పాకిస్తాన్‌లోనే అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సైతం అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
పాకిస్తాన్‌లో పాలపై ఇంతకుముందు ఎలాంటి పన్నూ ఉండేది కాదు. కానీ గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజ్డ్ పాలపై అక్కడి ప్రభుత్వం 18 శాతం పన్ను విధించింది. దీంతో పాల ధరలు 25 శాతం పైగా పెరిగాయి. కొత్తగా పన్ను వేయడంతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర 370 రూపాయలకు (పాక్ కరెన్సీ) చేరింది. డాలర్ల ప్రకారం చూస్తే లీటర్ పాల ధర 1.33 డాలర్లుగా ఉంది. పారిస్‌లో 1.23 డాలర్లు కాగా.. మెల్బోర్న్‌లో 1.08 డాలర్లు మాత్రమే. పాల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
బెయిలవుట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విధించిన షరతులను అందుకోవడంలో భాగంగా పాకిస్తాన్ ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచింది. మరోవైపు వేతనాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో పాక్ పౌరుల ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని చెబుతున్నారు. పాక్‌లో ఇప్పటికే సుమారు 40 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని, ముఖ్యంగా పేదరికంలో ఉన్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇది దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.