నేను కోర్టుకు వస్తే.. అక్కడే హత్య చేస్తారేమో.. - ఇమ్రాన్‌ఖాన్ ఆందోళన
ఇస్లామాబాద్‌లోని కోర్టుకు వెళ్లగా.. అక్కడ తనను చంపేందుకు విఫలయత్నం చేశారని ఆయన వివరించారు. 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు తనను చంపేందుకు వేచి ఉన్నారని ఆయన ఆరోపించారు.
తనను కోర్టులోనే చంపేసేందుకు అవకాశముందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, హత్యలు, దోపిడీ వంటి దాదాపు 100 కేసుల్లో ఇమ్రాన్‌ఖాన్ నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు.
గత శనివారం ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు హాజరైన సమయంలో లాహోర్‌లోని ఆయన ఇంటిపైకి వేలాదిమంది పోలీసులు వెళ్లి అనేక మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. అదే సమయంలో ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలోనూ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీసీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు, పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనల అనంతరం 300 మందికి పైగా పీటీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, వారిపై ఉగ్రవాద అభియోగాలు మోపారు. మరోపక్క ఇమ్రాన్‌ఖాన్ పార్టీపైనా నిషేధం విధించేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్‌ఖాన్ తనను హత్య చేసేందుకే ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తోషాఖానా అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్‌లోని కోర్టుకు వెళ్లగా.. అక్కడ తనను చంపేందుకు విఫలయత్నం చేశారని ఆయన వివరించారు. 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు తనను చంపేందుకు వేచి ఉన్నారని ఆయన ఆరోపించారు.
విచారణకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అట్టా బాందియర్‌కు లేఖ రాశారు. తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారణ చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.