పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్
ఇమ్రాన్ అరెస్టు సందర్భంగా హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆయన అరెస్టును అడ్డుకునేందుకు ఆయన తరఫు లాయర్లు శతవిధాలా ప్రయత్నించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను పారా మిలిటరీ బలగాలు మంగళవారం అరెస్టు చేశాయి. ఓ కేసు విచారణలో భాగంగా ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ను అక్కడే కస్టడీలోకి తీసుకున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మార్చి 7న ఇమ్రాన్ అరెస్టుకు ఇస్లామాబాద్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఇమ్రాన్‌పై ఏకంగా 85 కేసులు నమోదయ్యాయి.
ఇమ్రాన్‌ఖాన్ 2018 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ వరకు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆయన గత కొద్దికాలంగా ఆరోపిస్తున్నారు. వజీరాబాద్‌లో తనపై జరిగిన హత్యాయత్నంలో ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి హస్తం ఉందని ఆరోపించారు. అప్పట్లో ఆయన ఆరోపణలను మిలిటరీ ఖండించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు అరెస్టుకు ముందు కూడా ఇమ్రాన్ ఒక వీడియో విడుదల చేశారు. తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆ వీడియో పోస్ట్ చేశారు. అది విడుదలైన కొద్ది గంటలకే ఆయన్ని అరెస్టు చేయడం గమనార్హం. ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన పారా మిలిటరీ బలగాలు.. ఆయన్ను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఇమ్రాన్ అరెస్టు సందర్భంగా హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆయన అరెస్టును అడ్డుకునేందుకు ఆయన తరఫు లాయర్లు శతవిధాలా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. పలువురు గాయపడ్డారు. మరోవైపు పీటీఐ పార్టీ ట్విట్టర్‌లో ఇమ్రాన్ అరెస్టు వీడియోలను పోస్టు చేసింది. ఆయన అరెస్టుపై పీటీఐ ఉపాధ్యక్షుడు ఫవాద్ చౌధరీ వరుస ట్వీట్లు చేశారు.
హైకోర్టు ఆగ్రహం..
ఇమ్రాన్ అరెస్టు ఉదంతంపై ఇస్లామాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పాకిస్తాన్‌కు చెందిన డాన్ మీడియా ఒక కథనంలో వెల్లడించింది. 15 నిమిషాల్లో కోర్టు ముందు హాజరుకావాలని ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్, హోం సెక్రటరీ, అదనపు అటార్నీ జనరల్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆమిర్ ఫారుఖ్ ఆదేశించినట్టు తెలిపింది. లేదంటే ప్రధానికి సమన్లు పంపాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు పేర్కొంది. ఇమ్రాన్‌ను ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలంటూ చీఫ్ జస్టిస్ ఆదేశించినట్టు ఆ పత్రిక తెలిపింది.