Telugu Global
International

పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి..

వరదలతో అల్లకల్లోలం అవుతున్న పాక్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. అంతమాత్రాన ప్రజల కష్టాలు తీరతాయని కాదు, ప్రభుత్వంపై భారం తగ్గడంకోసమే ఈ పని చేసింది.

పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి..
X

పాకిస్తాన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రాజకీయ అస్థిరత్వం ఎక్కువగా ఉండే పాక్ లో ప్రభుత్వాలను కాదని, సైన్యం అధికారం చేజిక్కించుకునే క్రమంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడం సహజమే, అయితే ఈసారి కారణం అది కాదు. వరదలతో అల్లకల్లోలం అవుతున్న పాక్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. అంతమాత్రాన ప్రజల కష్టాలు తీరతాయని కాదు, ప్రభుత్వంపై భారం తగ్గడంకోసమే ఈ పని చేసింది.

అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, ప్రభుత్వ స్థిరత్వం కూడా అంతంతమాత్రమే. దీనికితోడు ఇప్పుడు భారీ వర్షాలు, వరదలు పాక్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వరదల వల్ల 937 మంది మరణించారని తెలుస్తోంది. 3కోట్లమంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక, పరిహారం ఎలా అందించాలో తెలియక, ప్రజల్ని ఆదుకోవడం చేతకాక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. ఎగుమతులపై నిషేధం విధించింది. ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేస్తోంది. ఖజానా ఖర్చుని తగ్గించుకుంటోంది.

జూన్ లో ప్రారంభమైన వర్షాలు ఇంకా తగ్గలేదు. మూడు నెలలుగా భారీ వర్షాలు వరదలతో పాక్ అల్లకల్లోలంగా మారింది. సింధ్ ప్రావిన్స్ లో 306 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయి. బలూచిస్తాన్ లో 234 మంది, పంజాబ్ ప్రావిన్స్ లో 165 మంది, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 185 మంది చనిపోయారు. పీఓకే, గిల్గిట్-బాల్టిస్తాన్ లో కూడా వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పాకిస్తాన్ లో సగటు వర్షపాతం 4.4 సెంటీమీటర్లు కాగా, ఆగస్ట్ లో 17 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అంటే 241 శాతం కంటే అది ఎక్కువ. భారీ వర్షాలకు వరదలతో గ్రామాలు నీటమునిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి, విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొన్ని జిల్లాలు నేటికీ అంధకారంలో మగ్గిపోతున్నాయి. అసలే అక్కడ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. పెట్రోల్, గ్యాస్, పాలు.. నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయి. ఈ దశలో వరదలతో రవాణా సౌకర్యాలు లేక నిత్యావసరాలకోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది కేంద్రం.

First Published:  26 Aug 2022 3:32 PM IST
Next Story