సొంత సైన్యం సత్తాపై పెదవి విరిచిన పాక్ ఆర్మీ మాజీ చీఫ్
భారత్‌తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదని, ట్యాంకులు కూడా పనిచేయడం లేదని, ఫిరంగులు తరలించడానికి డీజిల్ కూడా లేదని బజ్వా ఈ సందర్భంగా చెప్పడం విశేషం.
తమ దేశ సైన్యం సత్తాపై పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బజ్వా పెదవి విరిచారు. భారత ఆర్మీతో తమ ఆర్మీ సరితూగలేదని తేల్చేశారు. భారత సైన్యంతో పోరాడే శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ఆర్మీకి లేవని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. బ్రిటన్‌లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భారత్‌తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదని, ట్యాంకులు కూడా పనిచేయడం లేదని, ఫిరంగులు తరలించడానికి డీజిల్ కూడా లేదని బజ్వా ఈ సందర్భంగా చెప్పడం విశేషం. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. భారత్‌తో పాకిస్తాన్ శత్రుత్వం పెంచుకోకుండా.. స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే మంచిదని బజ్వా తెలిపారు.
భారత్‌తో సుదీర్ఘ విరోధం పాకిస్తాన్‌ను హరించి వేస్తుందని, భారత్‌తో పోరాడేందుకు అవసరమైన ఆయుధ సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు లేవని, అందుకే కాశ్మీర్ సమస్యపై ఇరు దేశాలూ శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నట్టు కూడా బజ్వా వెల్లడించారు. నిజానికి బజ్వా చేసిన వ్యాఖ్యలు అక్కడి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం పాక్‌లో ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. అక్కడి ప్రజలు అనేకమంది ఆకలితో అలమటిస్తుండటం గమనార్హం.