Telugu Global
International

హెడ్ ఫోన్స్ వాడకం వల్ల 100 కోట్ల మందికి పైగా వినికిడి లోపం ముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 43కోట్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఇక హెడ్‌ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇయర్‌బడ్‌లను ఉపయోగించడం వల్ల 100 కోట్ల మందికిపైగా ప్రజలు వినికిడి సమస్య‌ ముప్పును ఎదుర్కోనున్నారు.

హెడ్ ఫోన్స్ వాడకం వల్ల 100 కోట్ల మందికి పైగా వినికిడి లోపం ముప్పు
X

హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్‌లను ఉపయోగించడం, అధిక డెసిబెల్ వాల్యూమ్ ల‌ తో కూడిన సంగీత కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల ప్రపంచంలో దాదాపు 100 కోట్ల మంది వినికిడి సమస్యకు లోనయ్యే ముప్పును ఎదుర్కోనున్నారని ఓ అద్యయనం వెల్లడించింది. యుఎస్ లోని మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కరోలినా పరిశోధకులతో సహా అంతర్జాతీయ బృందం చేసిన ఈ పరిశోధన ఫలితాలను బిఎమ్‌జె గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 43కోట్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారని పరిశోధకులు తెలిపారు.

పెద్దలకు 80 డెసిబుల్స్,పిల్లలకు 75 డెసిబుల్స్ వాల్యూమ్ అనుమతించదగినది. అయితే హెడ్‌ఫోన్లు, ఇయర్పాడ్ ల‌ వినియోగదారులు తరచుగా 105 డెసిబెల్ (dB) కంటే ఎక్కువ వాల్యూమ్‌లను ఎంచుకుంటున్నారని గతంలో ప్రచురించిన పరిశోధన సూచిస్తుంది, ఇక బహిరంగ సంగీత కార్యక్రమాల్లో సగటు ధ్వని స్థాయిలు 104 డెసిబుల్స్ నుండి 112 డెసిబుల్స్ వరకు ఉంటాయి.

పరిశోధకులు, ఈ అంశంపై ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్ భాషలలో ప్రచురించిన అధ్యయనాలను పరిశోధించారు. ఇందులో ఎక్కువగా వినికిడి సమస్య ముప్పు 12 సంవత్సరాల వయసు నుంచి 34 సంవత్సరాల వయసువారిలో ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.

హెడ్‌ఫోన్లు, ఇయర్పాడ్ ల వల్ల టీనేజ్ వారిలో 24 శాతం యువకులలో 48 శాతం మంది వినికిడి సమస్యలను ఎదుర్కోనున్నారు. అంటే రాబోయే కాలంలో 67 కోట్ల నుండి 135 కోట్ల మంది వినికిడి సమస్య ముప్పును ఎదుర్కోనున్నారు. స్మార్ట్ ఫోన్ల అధిక వాడకం వల్ల కూడా వినికిడి ముప్పు ప్రమాదం ఉందని పరిశోధన తేల్చింది.

ఇప్పటికైనా హెడ్‌ఫోన్లు, ఇయర్పాడ్ లు, స్మార్ట్ ఫోన్లు వాడే ప్రజలు, వాటిని తయారు చేసే సంస్థలు, ప్రభుత్వాలు, పౌర సమాజం ఈముప్పుపై కళ్ళు తెరిచి పరిష్కారాల మార్గాలు వెతకకపోతే ఎప్పటికో అప్పటికి ఈ ప్రపంచం చెవిటి ప్రపంచంగా మారుతుందేమో?

First Published:  16 Nov 2022 5:15 PM IST
Next Story