Telugu Global
International

'బుల్డోజర్లు ప్రదర్శించినందుకు మమ్మల్ని క్షమించండి'

ముస్లింలను కించపర్చేవిధంగా అమెరికాలో బుల్డోజర్ల ప్రదర్శన చేసిన అమెరికన్ ఇండియన్లు క్షమాపణలు చెప్పారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు తాము చేసిన పనికి చింతిస్తున్నామని అమెరికాలోని ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ లేఖ విడుదల చేసింది.

బుల్డోజర్లు ప్రదర్శించినందుకు మమ్మల్ని క్షమించండి
X

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా, న్యూ జెర్సీలోని ఎడిసన్, వుడ్‌బ్రిడ్జ్ పట్టణాల్లో బుల్డోజర్లతో ప్రదర్శన నిర్వహించినందుకు ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ (IBA) క్షమాపణలు కోరింది.

" 2022 భారత స్వాతంత్య్ర‌ దినోత్సవ పరేడ్‌లో మా సంస్థ చేసిన పని భారతీయ అమెరికన్ మైనారిటీ సమూహాలను, ముఖ్యంగా ముస్లింలను కించపరిచే విధంగా ఉన్నందుకు మేముహృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నాము." అని IBA అధ్యక్షులు చంద్రకాంత్ పటేల్ ఎడిసన్, వుడ్‌బ్రిడ్జ్ మేయర్లకు లేఖ రాశారు.

ఎడిసన్ మేయర్ సమీప్ జోషి (అతను స్వయంగా భారతీయ అమెరికన్), వుడ్‌బ్రిడ్జ్ మేయర్ జాన్ మెక్‌కార్మాక్ లు భారతీయ అమెరికన్లు నిర్వహించిన బుల్డోజర్ ప్రదర్శనను ఖండించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఆనాడు ర్యాలీ నిర్వహించిన బృందం క్షమాపణలు చెప్పాలని సమీప్ జోషి కోరారు. ఈ నేపథ్యంలో ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఇద్దరు మేయర్లకు లేఖను రాసింది.

భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని పటేల్ తన లేఖలో పేర్కొన్నారు. ''స్వాతంత్య్ర దినోత్సవ పెరేడ్ అనేది భారతీయ వారసత్వం, విభిన్న సంస్కృతులు, మతాల మధ్య వైవిధ్యాల వేడుకలా ఉండాలనే మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో మేము బుల్డోజర్ వంటి వాటిని అనుమతించబోము'' అని పటేల్ లేఖలో అన్నారు.

IBA బహిరంగ క్షమాపణలు చెప్పినందుకు కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR-NJ) న్యూజెర్సీ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెలెడిన్ మక్సూట్, వుడ్‌బ్రిడ్జ్ మేయర్ మెక్‌కార్మాక్ లు ధన్యవాదాలు తెలిపారు. ''మా ఆందోళనను తీవ్రంగా పరిగణించి బహిరంగ క్షమాపణలు చెప్పినందుకు ధన్యవాదాలు'' అని వారు అన్నారు.

అయితే ఈ లేఖ రాయడానికి కొద్ది రోజుల ముందే IBA అధ్యక్షుడు చంద్రకాంత్ పటేల్ 'మిడిల్ ఈస్ట్ ఐ' అనే మీడియా సంస్థతో మాట్లాడుతూ...మేము చేసిన దాంట్లో తప్పులేదని అన్నాడు. తమను విమర్శించడం పక్షపాతంతో కూడుకున్నదన్నారాయన. ''బుల్డోజర్ అనేది భారత దేశంలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇది ముస్లింలకు వ్యతిరేక౦ కాదు" అని చెప్పారు పటేల్.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా మాట్లాడే ముస్లింల ఇళ్లను చట్టవిరుద్ధం అనే నెపంతో బుల్డోజర్లతో కూల్చివేస్తుండటంతో ప్రస్తుతం బుల్డోజర్ భారతదేశంలో అణచివేతకు చిహ్నంగా మారింది.

First Published:  1 Sept 2022 8:15 PM IST
Next Story