Telugu Global
International

ఓపెన్ డోర్స్.. ఇదో కొత్త రకం చర్చా వేదిక

ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో లభ్యం అయ్యే 'ఓపెన్ డోర్స్' యాప్ ద్వారా ట్రూకాలర్ యూజర్స్‌తో చర్చ పెట్ట‌వ‌చ్చు.

ఓపెన్ డోర్స్.. ఇదో కొత్త రకం చర్చా వేదిక
X

మన అభిప్రాయాలు పంచుకోవడానికి ఒక వేదిక అనేది ముఖ్యం. గతంలో లైబ్రరీలు, కాలేజీలు, క్లబ్స్, రచ్చబండలు, కార్యాలయాలు చర్చా వేదికలుగా ఉండేవి. కాలంతో పాటు చర్చా వేదికల అర్థం మారుతూ వచ్చింది. టీవీ, రేడియో చర్చలు కూడా అందరూ చూశారు. ఇక ఇంటర్నెట్ విస్తృతంగా వ్యాపించిన తర్వాత భౌతికంగా ఒక దగ్గర కూర్చొని చేసే చర్చలకు తోడుగా ఆన్‌లైన్ చర్చలు కూడా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో చర్చలు చేస్తూనే ఉంటారు. అయితే లైవ్ మోడ్‌లో వాయిస్ ఓన్లీ చర్చలు జరిపే ప్లాట్‌ఫామ్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి.

ఇలాంటి చర్చలకు మొదటిగా క్లబ్‌హౌస్ అనే యాప్ వచ్చింది. ఇందులో ఏదైనా సబ్జెక్ట్‌పై విస్తృతంగా చర్చ చేసే అవకాశం ఉంది. చర్చ జరుగుతున్న హౌస్‌లోకి మనం వెళ్లి వినవచ్చు. వాళ్లు అనుమతిస్తే మాట్లాడవచ్చు. మొదట్లో ఈ యాప్ చాలా పాపులర్ అయినా.. ఆ తర్వాత ఎందుకో క్రమంగా ఆదరణ కోల్పోయింది. అయితే ట్విట్టర్ ఇలాంటి ఫీచర్‌ను అందిస్తోంది. ట్విట్టర్ స్పేసెస్ పేరుతో చర్చా వేదికను ఏర్పాటు చేసింది. మనం ఫాలో అయ్యే వ్యక్తి చర్చ పెడితే ఆటోమెటిక్‌గా మనకు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా చర్చా వేదికల ఫీచర్ తీసుకొని రావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

తాజాగా ట్రూ కాలర్ ఒక చర్చా వేదిక యాప్‌ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఫోన్ కాలర్ ఐడీ యాప్ ఒక వినూత్న కాన్సెప్ట్‌తో ఈ వేదికను ప్రారంభించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో లభ్యం అయ్యే 'ఓపెన్ డోర్స్' యాప్ ద్వారా ట్రూకాలర్ యూజర్స్‌తో చర్చ పెట్ట‌వ‌చ్చు. అయితే ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే తప్పకుండా మన కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించాల్సి ఉంటుంది.

మన కాంటాక్ట్స్‌లోని ఎవరైనా చర్చలో పాల్గొన్నా, చర్చ ప్రారంభించినా మనకు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో మనం కూడా ఆ కాన్వర్‌జేషన్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, లాటిన్, ఫ్రెంచ్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. భవిష్యత్‌లో మరిన్ని భాషల్లోకి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఓపెన్ డోర్స్ యాప్ ప్రైవసీకి పెద్ద పీఠ వేస్తోంది. మనం మన ఫోన్ నెంబర్‌తో లాగిన్ అయినా.. మన వివరాలు ఏవీ ఇతరులకు తెలియవు. మన ప్రైవసీకి ఎలాంటి భంగం లేకుండానే యాప్ ఉపయోగించవచ్చని ట్రూ కాలర్ చెప్తోంది.

First Published:  18 July 2022 6:36 PM IST
Next Story