ఒకవైపు ప్రమాణస్వీకారం... మరోవైపు ఆయన రాజీనామా చేయాలంటూ నిరసనలు
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన అధ్యక్షుడవడాన్ని వ్యతిరేకిస్తున్న ఆ దేశ ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. విక్రమసింఘే రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఇవ్వాళ్ళ పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే గురువారంనాడు పార్లమెంట్ ఆవరణలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా 73 ఏళ్ల విక్రమసింఘేతో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా రణిల్ ను శ్రీలంక పార్లమెంటు ఎన్నుకున్న విషయం తెలిసిందే. విక్రమసింఘే గతంలో ఆరుసార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా పని చేశారు.
అయితే రాజపక్స కు అనుకూలుడిగా పేరున్న రణిల్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే పార్లమెంటు వెలుపల ఆందోళన కారులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రణిల్ ఎన్నిక జరిగిందని, ఆయన రాజీనామా చేసేవరకూ తమ నిరసనలు కొనసాగిస్తామని ఆందోళనకారులు చెబుతున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రణిల్ విక్రమసింఘే ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ప్రజా ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతున్న దేశాన్ని గట్టెక్కించాల్సి ఉంది. కొంతకాలంగా గతి తప్పిన పాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా రణిల్ పై ఉంది. కానీ ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గొటబయ రాజపక్సే కుటుంబానికి అతి దగ్గరివాడిగా పేరున్న విక్రమసింఘే అధ్యక్షుడవడం శ్రీలంక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమ ఉద్యమ డిమాండ్ కు వ్యతిరేకంగా విక్రమసింఘే అధ్యక్షుడవడాన్ని తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని కొలొంబోలో ఆందోళనలు చేస్తున్న ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఆయన గద్దె దిగే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు.
మరో వైపు నిరసనలను సైన్యం ద్వారా అణిచివేసేందుకు అధ్యక్షుడు విక్రమసింఘే సిద్దమవుతున్నారు. అవసరమైతే నిరసనకారులను కాల్చి చంపాలంటూ విక్రమసింఘే సైన్యానికి ఆదేశాలివ్వడం గమనార్హం.