Telugu Global
International

నిజంగా అద్భుతం.. ఆ చిన్నారులు బ‌తికే ఉన్నారు..

విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ కూడా ఉన్న‌ట్టు వారు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి వారు అడవుల్లో సంచరిస్తున్నట్టు త‌మ గాలింపులో వారికి తెలిసింది.

నిజంగా అద్భుతం.. ఆ చిన్నారులు బ‌తికే ఉన్నారు..
X

అవును.. ఇది నిజంగా అద్భుత‌మే.. ద‌ట్ట‌మైన అమెజాన్ అడ‌వుల్లో మే ఒక‌టో తేదీన‌ జ‌రిగిన విమాన ప్రమాదంలో న‌లుగురు చిన్నారులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వారిలో 11 నెల‌ల ప‌సికందు కూడా ఉండ‌టం విశేషం. విమానం మిస్స‌యిన 17 రోజుల త‌ర్వాత ఆ చిన్నారుల‌ను స‌జీవంగా గుర్తించ‌డంతో ప్ర‌పంచ‌మంతటా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని అరారా క్యూరా నుంచి శాన్టిస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటిన విమానం బయలుదేరింది. అందులో పైలట్, ఆరుగురు ప్ర‌యాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. 'ఆపరేషన్ హోప్' పేరిట దట్టమైన అడవుల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో పైలట్, మరో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను గుర్తించారు.

విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ కూడా ఉన్న‌ట్టు వారు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి వారు అడవుల్లో సంచరిస్తున్నట్టు త‌మ గాలింపులో వారికి తెలిసింది. వారు క్షేమంగా ఉన్నారని తెలియజేసేలా చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, పాల సీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. ఎటువెళ్లాలో తెలీక వారు అక్కడక్కడే తిరుగుతున్నట్టు గుర్తించారు. దాంతో గాలింపును మరింత తీవ్రం చేయగా.. వారి జాడ లభ్యమైంది. వారిని సురక్షితంగా కాపాడారు.

పిల్ల‌ల‌ను ప్రాణాల‌తో గుర్తించిన విష‌యంపై కొలంబియా అధ్య‌క్షుడు గుస్తావో పెట్రో స్పందిస్తూ.. దేశానికి ఇది సంతోషకరమైన రోజు అని ప్రకటించారు. కఠిన ప్రయాసలతో కూడిన గాలింపు చర్యల అనంతరం వారిని గుర్తించినట్టు ట్విటర్ వేదికగా వెల్ల‌డించారు.

First Published:  19 May 2023 8:10 AM IST
Next Story