యుద్ధాలతో కాదు.. దౌత్యాలతోనే సమస్యలకు పరిష్కారం
లావోస్‌లోని 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. లావోస్‌లోని 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. నేను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చాను. ఇది యుద్ధాల యుగం కాదు. యుద్ధంతో సమస్యలకు పరిష్కారాలు దొరకవు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వర్ధమాన దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ప్రపంచ శాంతిభద్రతకు ఉగ్రవాదం కూడా పెను సవాల్‌గా మారింది. దీన్ని ఎదుర్కోవడానికి మానవత్వంపై విశ్వాసం ఉన్న శక్తులన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా సైబర్, సముద్ర, అంతరిక్ష రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టాలను అందరూ గౌరవించాలి. సమస్యల పరిష్కారానికి చర్చలకు, దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యురేషియా, పశ్చిమాసియాల్లో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించాలి' అన్నారు.
అలాగే సముద్ర కార్యకలాపాలు ఐక్యరాజ్యసమితి చట్టాలకు లోబడి జరగాలన్నారు. నావిగేషన్, ఎయిర్ స్పేస్ స్వేచ్ఛను నిర్ధారించడం అవసరమని మోడీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం స్వేచ్ఛ, బహిరంగ, సమ్మిళిత, శ్రేయస్సు, నియమాలతో కూడిన ఇండో పసిఫిక్ రిజియన్ ముఖ్యమన్నారు. ఇటీవల యాగి తుపాను కారణంగా మరణాలు సంభవించడం పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ప్రమాదకర చర్యలు : ఆంటోని బ్లింకెన్
దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ప్రమాదకర చర్యలు పెరుగుతున్నాయని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా చర్యలను విమర్శించారు. ఆసియాన్ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. చైనా దుందుడుకు చర్యల ఫలితంగా దక్షిణ, తూర్పు, చైనా సముద్రంలో పలువురు గాయపడ్డారు. ఓడలు దెబ్బతిన్నాయి. శాంతియుత పరిష్కార ఒప్పందాలకు విరుద్ధంగా చైనా ప్రవర్తిస్తున్నదని లావోస్‌లో సమావేశమైన ఆగ్నేయాసియా నేతలతో బ్లింకెన్ వ్యాఖ్యానించారు.