Telugu Global
International

కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లోకి పీవీ సింధుకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే..!

భారత అథ్లెట్లు అందరూ కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లోకి వెళ్లిపోగా.. పీవీ సింధు ఎంట్రీకి అధికారులు నిరాకరించారు. అయితే సింధు స్థానంలో ఎవరు పరేడ్‌లో పాల్గొంటారో ఇంకా భారత అధికారులు నిర్ణయించలేదు.

కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లోకి పీవీ సింధుకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే..!
X

కామన్వెల్త్ గేమ్స్ - 2022 ఈరోజు అర్ధ‌రాత్రి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానున్నాయి. గేమ్స్ ప్రారంభానికి ముందే టీమ్ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈవెంట్‌లో పాల్గొనడానికి ఇండియా నుంచి 214 మంది క్రీడాకారులు ఇంగ్లాండ్ వెళ్లారు. అయితే అక్కడకు చేరుకున్న వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా స్టార్ షట్లర్ పీవీ సింధు రిపోర్ట్ కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది.

గురువారం మరోసారి పరీక్షించగా రిపోర్టు అనుమానాస్పదంగా రావడంతో పీసీ సింధు ఐసోలేషన్‌కు వెళ్లిపోయింది. మిగిలిన భారత అథ్లెట్లు అందరూ కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లోకి వెళ్లిపోగా.. పీవీ సింధు ఎంట్రీకి అధికారులు నిరాకరించారు. ప్రస్తుతం ఆమెను ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. గురువారం అర్ధ‌రాత్రి 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. పురుషుల హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనాల్సి ఉంది. అయితే సింధు స్థానంలో ఎవరు పరేడ్‌లో పాల్గొంటారో ఇంకా భారత అధికారులు నిర్ణయించలేదు.

పీవీ సింధు తొలి మ్యాచ్ ఆగస్టు 3న ఆడాల్సి ఉంది. మిక్స్‌డ్ డబుల్స్ జూలై 29నే జరుగుతాయి. కానీ అందులో అశ్వని పొన్నప్ప, సుమిత్ రెడ్డి బరిలోకి దిగుతారు. పీవీ సింధు ఆగస్టు 3న మధ్యాహ్నం రౌండాఫ్ 64లో తలపడాల్సి ఉంది. అప్పటిలోగా సింధు కోలుకుంటుందా లేదా అని భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. ఇక 2018 గోల్డ్‌కోస్ట్ సీడబ్ల్యూజీలో రజత పతకం సాధించింది. ఈ సారి తప్పకుండా గోల్డ్ మెడల్ గెలుస్తానని సింధు పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. కానీ అంతకు ముందే ఆమె కోవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఒక వేళ ఆగస్టు 3 లోగా కోలుకున్నా.. సింధు ఫిట్‌నెస్ సరిగా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

First Published:  28 July 2022 2:36 PM GMT
Next Story