టేకాఫ్ అవుతుండగా విమానంలో అకస్మాత్తుగా మంటలు
హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన పెను ముప్పు
హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ముప్పు తప్పింది. జార్జిబుష్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్లో విమానం టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా దాని రెక్కల్లో ఒక దాని నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర తలుపును తెరవగా ఇన్‌ప్లేటబుల్ స్లైడ్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రయాణికులను సురక్షితంగా దించేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్యల తలెత్తడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికురాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఇటీవల అమెరికాలో రెండు విమాన ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రమాదం జరడంతో ఎఫ్‌ఏఏ ప్రమాదాలకు గల కారణాలపై దర్యాప్తు వేగవంతం చేసింది.