ఓడిపోతే మళ్లీ పోటీ చేయను: ట్రంప్
విజయం సాధిస్తే దాని వెనుక ముగ్గురి పాత్ర ఉంటుందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన ఓపెన్ డిబేట్‌లో పైచేయి సాధించిన అనంతరం విజయంపై విశ్వాసంతో ఉన్న ఆయన ప్రస్తుతం కమలా హారిస్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే భవిష్యత్తులో మరోసారి పోటీ చేయనని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈసారి విజయం సాధిస్తాననే నమ్మకం తనకు ఉన్నదన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మేం ఈసారి ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదన్నారు. అలాంటి ఆలోచనే లేదన్నారు. తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ మేం ఓడిపోతే 2028 జరిగే ఎన్నికల్లో తాను బరిలోకి దిగనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడు తాను విజయం సాధిస్తే దాని వెనుక ముగ్గురి పాత్ర ఉంటుందన్నారు. కెన్నడీ జూనియర్, ఎలాన్ మస్క్, తుల్సి గబ్బార్డ్‌కు చాలా విషయాలపై అవగాహన ఉన్నది. ఆరోగ్యం, పర్యావరణంపై కెన్నెడీ పనిచేస్తారు. దేశంలో చెత్తను తొలిగించడంలో మస్క్ కీలక పాత్ర పోషిస్తారు. తుల్సికి పరిపాలనా అనుభవం ఉన్నది. మేం అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే ఇంధన ధరలు 50 శాతానికి తగ్గించడానికి యత్నిస్తామన్నారు. ఈ నిర్ణయం కార్లకు మాత్రమే కాకుండా.. ఇతర వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ట్రంప్ వెల్లడించారు.
మరోవైపు నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, ట్రంప్‌నకు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. డెమోక్రటిక్ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షరాలు కమలా హారిస్‌తో ఇటీవల జరిగిన డిబేట్‌లో డొనాల్డ్ ట్రంప్ తడబాటునకు గురయ్యారని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి కమలాతో ఓపెన్ డిబేట్ చేయబోనని ట్రంప్ ప్రకటించిన విషయం విదితమే. అక్టోబర్ 23న సీఎన్‌ఎన్ వేదికగా జరగబోయే డిబేట్‌కు తాను సిద్ధమని.. ట్రంప్ కూడా అంగీకరించాలని కమలా హారిస్ పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తాజాగా ఎన్‌బీసీ న్యూస్ విడుదల చేసిన పోల్‌లోనూ కమలా హరిస్ 5 శాతం పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హారిస్‌కు 48 శాతం, ట్రంప్‌నుక 40 శాతం మంది ఓటర్ల మద్దతు ప్రకటించారు. మూడు పాయింట్లు ఎర్రర్ మార్జిన్ ఉన్నట్లు ఎన్‌బీసీ వెల్లడించింది.