అగ్నిపథ్ పథకం: భారత సైన్యంలో గూర్ఖా సైనికుల నియామకాన్ని నిలిపివేసిన నేపాల్
అగ్నిపథ్ పథకం కారణంగా భారత సైన్యంలో గూర్ఖా సైనికుల నియామకాన్ని నేపాల్ నిలిపివేసింది. 1947లో నేపాల్, భారత్, బ్రిటన్‌లు మధ్య జరిగిన ఒప్పందంలోని నిబంధనలకు ఈ పథకం కట్టుబడి లేదని నేపాల్ పేర్కొంది.
భారత సైన్యంలో గూర్ఖా సైనికుల నియామకాన్ని నేపాల్ నిలిపివేసింది. ఇటీవల భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కారణంగా నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని రాజకీయ పార్టీలు, సంబంధీకులతో విస్తృత సంప్రదింపులు జరిగే వరకు అగ్నిపథ్ పథకం ద్వారా భారత సైన్యంలో గూర్ఖాల నియామకాన్ని అనుమతించబోమని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవకు నేపాల్ విదేశాంగ మంత్రి నారాయణ్ ఖడ్కా తెలియజేసినట్లు సమాచారం. భారత సైన్యంలోకి నేపాలీ సైనికుల నియామకాల విషయంలో 1947లో నేపాల్, భారత్, బ్రిటన్‌లు మధ్య జరిగిన ఒప్పందంలోని నిబంధనలకు ఈ పథకం కట్టుబడి లేదని ఆయన పేర్కొన్నారు. భారత్ అగ్నిపథ్ పేరుతో తెచ్చిన కొత్త వ్యవస్థను 1947 నాటి ఒప్పందం గుర్తించలేదని, అందువల్ల ఈ కొత్త పథకం ఏర్పాటు ప్రభావాన్ని తాము అంచనా వేయవలసి ఉంటుందని ఖాడా శ్రీవాస్తవకు వివరించారు.
అగ్నిపథ్ పథకం కింద, సైనికులను 4 సంవత్సరాల కాలానికి నియమించుకుంటున్నారు. వారి పనితీరు ఆధారంగా, రిక్రూటీలలో 25 శాతం మందికి మాత్రమే పూర్తి కాలం సేవను పొడిగిస్తారు. మిగిలిన సైనికులకు దాదాపు రూ.11-12 లక్షల ప్యాకేజీని ఇచ్చి వారిని ఇంటికి పంపేస్తారు. వారిని అగ్నివీరులుగా పరిగణిస్తారు.
ఈ పథకం ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, హింసాయుత సైంఘటనలకు దారితీసింది. కోవిడ్ కారణంగా రెండేళ్ళుగా సైనిక రిక్రూట్ మెంటు నిలిపివేశారు. అప్పటికే ఆశతో లక్షలాది మంది అభ్యర్ధులు సైన్యంలోకి చేరేందుకు సైనిక శిక్షణ తీసుకున్నారు. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు జల్లుతూ అగ్నిపథకం తీసుకొచ్చింది. దీనిపై మేధావులు, విపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. సైనిక వ్యవస్థను కూడా ప్రైవేటు పరం చేసినట్టుగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. నాలుగేళ్ల పాటు సైన్యంలో చేసి తిరిగి వచ్చిన తర్వాత వారి జీవితానికి భద్రత ఏం ఉంటుందనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే తిరిగి వచ్చిన అగ్నివీరులు సెక్యూరిటీ గార్డులుగాను, ఇతర కంపనీలలోనూ ఉద్యోగాలలో చేరవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్లను చేపట్టిన కేంద్రం వేలాదిగా అభ్యర్ధులు చేరిపోతున్నారని, ఈ పథకం పై ఎంతో ఆదరణ, ఆసక్తి చూపుతున్నారంటూ ప్రకటనలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. రిటైరయిన సైనికుల పెన్షన్ ఖర్చులు తదితరాలతో బడ్జెట్ నిర్వహణా వ్యయం పెరిగిపోతున్నందున వాటిని తగ్గించుకునే ఆలోచనతోనే ఈ అగ్నిపథ్ పథకం తీసుకొచ్చారని ప్రభుత్వ వర్గాల్లో వినబడింది.