సుఖాంతమైన నైజీరియా భారీ కిడ్నాప్, 300 మంది పిల్లలు విడుదల
ఆఫ్రికాలోని నైజీరియాలో రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన 300 మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాపర్లు ఎట్టకేలకు విడుదల చేశారు.
ఆఫ్రికాలోని నైజీరియాలో రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన 300 మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాపర్లు ఎట్టకేలకు విడుదల చేశారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, చక్కని వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.
కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి విద్యార్థులను ఈ నెల 7న సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు. విద్యార్థులను తమతో పాటు సమీపంలో ఉన్న అడవులకు తీసుకుపోయారు. చిన్నారుల్లో 12 ఏళ్ల లోపు ఉన్నవారే దాదాపు 100 మంది వరకు ఉన్నారు. వాళ్లని విడుదల చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని లేకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు. అయితే నైజీరియా అధ్యక్షుడు టినుబు మాత్రం పిల్లలను ఒక్క పైసా చెల్లించకుండి విడుదల చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. చెప్పినట్టుగానే ఒక్కపైసా చెల్లించకుండా కిడ్నప్‌కు గురైన వారందరినీ విడిపించారు.
ఈ ఘటనపై కడునా రాష్ట్ర గవర్నర్ ఉబా సని ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులను క్షేమంగా విడుదల చేసేందుకు యత్నించిన నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో టినుబు తీసుకున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు. భద్రతా ఏజెన్సీలు తీసుకున్న వ్యూహాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. నైజీరియా భద్రతా సలహాదారు దగ్గరుండి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారని కొనియాడారు. వారి చొరవతోనే పిల్లలు బయటకు వచ్చారని వెల్లడించారు.
ఉత్తర నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలోనూ ఉన్నా.. ఇంత భారీసంఖ్యలో జరగడం కలకలం రేకెత్తించింది. ఇటీవల ఈ కిడ్నాప్‌లు దేశంలోని వాయువ్య, సెంట్రల్ ప్రాంతాలకు కూడా పాకాయి. సాయుధ దుండుగులు నగదు కోసం గ్రామస్థులను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 1,400 మంది విద్యార్థులు కిడ్నాప్ అయ్యారు.