Telugu Global
International

Pilot whales : బతికించలేక.. బాధ పెట్టలేక.. చంపేశారు..

రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో తూర్పు అల్బానికి సుమారు 60 కి.మీ దూరంలో చెయిన్స్‌ బీచ్‌ తీరానికి ఒక్కసారిగా సుమారు వంద పైలట్‌ తిమింగలాలు కొట్టుకొచ్చాయి.

Pilot whales : బతికించలేక.. బాధ పెట్టలేక.. చంపేశారు..
X

ఆస్ట్రేలియా చెయిన్స్‌ బీచ్‌ తీరానికి కుప్పలు తెప్పలుగా పైలట్‌ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. సుమారు వందకు పైగా తిమింగలాలు ఒడ్డుకు చేరి సొమ్మసిల్లి పడిపోయాయి. తక్షణమే స్పందించిన ఆస్ట్రేలియా పార్క్స్, వైల్డ్‌లైఫ్ సర్వీస్‌ అధికారులు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనే విషయం కంటే వాటిని ప్రాణాలను ఎలా కాపాడాలి అనే అంశంపై దృష్టి పెట్టారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కొన్ని చనిపోగా కొన ఊపిరితో ఉన్న మిగిలిన వాటిని బతికించే అవకాశం లేక వాటి వేదనను చూడలేక నొప్పి లేని మరణాన్ని అందించారు.

రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో తూర్పు అల్బానికి సుమారు 60 కి.మీ దూరంలో చెయిన్స్‌ బీచ్‌ తీరానికి ఒక్కసారిగా సుమారు వంద పైలట్‌ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. అందులో చాలావరకు నిస్సహాయ స్థితిలో కొన ఊపిరితో ఉన్నవే. మొదట చూసేసరికి వాటిలో 30 దాకా మరణించి ఉన్నాయి.. మిగిలిన వాటిని రక్షించటానికి వన్యప్రాణుల సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కానీ, చూస్తుండగానే మరో 20 ప్రాణాలు కోల్పోయాయి. మిగిలిన 45 తిమింగలాలను రక్షించేందుకు అధికారులు, వన్య ప్రాణి సంరక్షణ విభాగ వలంటీర్లు చాలా ప్రయత్నాలు చేశారు.. వాటిని తిరిగి మళ్లీ సముద్రంలోకి తీసుకెళ్లారు. ఒక రాత్రంతా వీటిని అధికారులు, వలంటీర్లు పర్యవేక్షించారు.



నీటిలోకి తిరిగి పంపేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. ఒక్కసారి తిమింగలం ఇసుకలో చిక్కుకొంటే అది మృత్యుఒడికి చేరుకున్నట్టే. ఇక చేసేదేం లేక వాటికి నొప్పిలేకుండా మరణం ప్రసాదించాలని అధికారులు నిర్ణయించారు. విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. వాటిని నీటి లోతుల్లోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, అందుకే ఈ బాధాకర నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా పార్క్స్, వైల్డ్‌లైఫ్ సర్వీస్‌ అధికారి పీటర్ హార్ట్లీ వెల్లడించారు. తిమింగలాలను రక్షించే ప్రయత్నంలో సహకరించిన వందలాది మంది వలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వాస్తవానికి పైలట్ తిమింగలాలు అనేవి చాలా అరుదైన జీవులు. ఇవి గుంపులు గుంపులుగానే తిరుగుతాయి. రెండు మూడు సంవత్సరాలకోసారి బిడ్డకు జన్మనిస్తాయి. అలాగే ఆ బిడ్డను పెంచేందుకు తల్లి కొన్ని నెలల పాటు తిండి మానేస్తుంది అని చెబుతారు. ఇక ఆ బిడ్డ పెరిగి తోడు వెతుక్కునే వరకు దాన్ని కాపాడుకునేందుకు కొన్ని తిమింగలాలు మళ్లీ గర్భం దాల్చకుండా జాగ్రత్తపడతాయి. అందుకే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.




సాధారణంగా ఆహారం కోసం ఒడ్డుకు వచ్చిన తర్వాత మళ్లీ నీళ్లల్లోకి వెళ్లిపోతాయి. కానీ, కొన్ని అసాధారణ పరిస్థితులు, అనారోగ్యం, స్ట్రెస్ వల్ల కూడా తిమింగలాలు ఈ విధంగా తీరానికి కొట్టుకొస్తాయి. ఒక్కోసారి ఒక తిమింగలం కష్టంలో ఉంటే దాన్ని కాపాడటానికి మిగతా అన్నీ అదే బాటపడతాయి. ఆ ప్రయత్నంలో ఒకసారి ఇసుకలో చిక్కుకుంటే మాత్రం మళ్ళీ బతకడం అసంభవం.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఈ విధంగా సముద్రం వద్ద తిమింగలం చనిపోవడం అనేది అసాధారణమైన విషయమేమీ కాదు. గత అక్టోబర్ లో కూడా దాదాపు 500 పైలట్ తిమింగలాలు న్యూజిలాండ్ లోని ఓ బీచ్ కు కొట్టుకు వచ్చాయి.

First Published:  27 July 2023 6:03 PM IST
Next Story