ఇది నిజంగానే ''లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై"
ఈ ఫొటోని నాసా సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బుధ గ్రహం గురించి చాలా సమాచారాన్ని తన పోస్ట్ లో అందించింది.
అంతరిక్షంలో అద్భుతాలను చూడటం ఎప్పుడూ ఉత్సాహంగానే అనిపిస్తుంది. అందుకే అంతరిక్ష కేంద్రాలు ఆ అద్భుతాలను తన కెమెరాలో బంధించగానే.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాయి. తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మన సౌర కుటుంబంలోని అతి చిన్న గ్రహం అయిన బుధుడికి (Mercury) సంబంధించి ఒక స్టన్నింగ్ ఫొటోను షేర్ చేసింది. కళ్లు తిప్పుకోనివ్వని అందంతో కళకళలాడిపోతున్నాడు ఈ ఫొటోలో బుధుడు. నీలి రంగు షేడ్స్‌తో పాటు యెల్లోయిష్-బ్రౌన్ కలర్లతో.. ఒక వజ్రం మెరిసినట్టు మెరిసిపోతున్నాడు. ఫొటోలో గ్రహ ఉపరితలంపై క్రేటర్స్ కూడా మనం గమనించవచ్చు.
మెసెంజర్ అనే అంతరిక్ష నౌక ఈ ఫొటోని తీసింది. బుధుడు ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించే పనిలో ఉన్న ఈ నౌక బుధుడి భూగర్భ శాస్త్రం, అయస్కాంత క్షేత్రం, రసాయన కూర్పును అధ్యయనం చేయడమే లక్ష్యంగా ప్రయోగించింది.
ఈ ఫొటోని నాసా సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బుధ గ్రహం గురించి చాలా సమాచారాన్ని తన పోస్ట్ లో అందించింది.
ఈ గ్రహం చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. వాతావరణం లేకపోవడం, సూర్యునికి దగ్గరగా ఉండటంతో.. పగటిపూట 800ºF (430ºC) నుంచి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత శక్తి చాలా బలహీనమైందని తెలిపింది.
బుధుడు సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండి, సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం.. భూమికి 88 రోజులతో సమానం.