Telugu Global
International

కలరా భయంతో పడవ ప్రయాణం, నీట మునిగి 90 మంది మృతి..

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్‌ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు.

కలరా భయంతో పడవ ప్రయాణం, నీట మునిగి 90 మంది మృతి..
X

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్‌ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు. పడవ ద్వారా దాదాపుగా 130 మందితో ఉన్న ఫిషింగ్ బోట్ నాంపులా ప్రావిన్స్‌లోని ఒక ద్వీపానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో అధిక సంఖ్య‌లో పిల్ల‌లు ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. సముద్రంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మృతదేహాల వెలికితీత కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. బోటులో పరిమితి కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటం తోనే ప్రమాదం సంభవించినట్లు, ఈ ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారని నంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో వెల్లడించారు. స్థానికంగా కలరా వ్యాప్తిచెందుతుందంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని ఆయన తెలిపారు.

ప్రభుత్వలెక్కల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత పేదదేశాల్లో మొజాంబిక్‌ ఒకటి. ఇక్కడ గత అక్టోబర్ నుంచి దాదాపుగా 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. వీరిలో ౩౨ మంది మరణించారు. ఎక్కువగా నంపులా ప్రావిన్స్ ప్రభావితమైంది. కలరా కేసుల్లో ఏకంగా మూడో వంతు కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఈ కారణంతోనే ప్రజలు దీవుల్లోకి వెళ్ళిపోతే కలరా తమకు వ్యాపించదు అన్న భావంతో వెళ్ళిఉంటారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


First Published:  8 April 2024 10:25 AM IST
Next Story