Telugu Global
International

వణికిస్తున్న మౌంట్‌ ఇబు అగ్నిపర్వతం

ఒక్క జనవరి నెలలోనే వెయ్యిసార్లు విస్ఫోటం చెందిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడి

వణికిస్తున్న మౌంట్‌ ఇబు అగ్నిపర్వతం
X

ఇండోనేసియా ప్రజలను మౌంట్‌ ఇబు అగ్నిపర్వతం వణికిస్తున్నది. ఒక్క జనవరి నెలలోనే వెయ్యిసార్లు విస్ఫోటం చెందిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. రానున్నరోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నార్త్‌ మలుకు ప్రావిన్స్‌లోని హల్మహేరా ద్వీపంలోని మౌంట్‌ ఇబు జనవరి నుంచి విస్ఫోటం చెందుతూనే ఉన్నది. ఇప్పటివరకు దాని నుంచి గాలిలోకి 0,3 కి.మీ. నుంచి 4 కి.మీ. వరకు బూడిద ఎగసిపడింది. తాజాగా ఆదివారం 1.5 కి.మీ. మేర పైవరకు బూడిద కనిపించింది. మౌంట్‌ ఇబు అబ్జర్వేషన్‌ పోస్ట్‌ వరకు శబ్దం వినిపించిందని జియోలాజికల్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 17 సార్లు అగ్నిపర్వతం బద్దలైందని తెలిపింది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఆరు గ్రామాల్లోని మూడు వేల మంది గ్రామస్థులు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు జరగుతున్నాఇ. అయితే పలువురు గ్రామస్థులు అధికారుల హెచ్చరికలను పాటించడానికి నిరాకరిస్తున్నారు. తమ పంటలను మధ్యలో వదిలి వచ్చేయడానికి వారు సిద్ధంగా లేరు. అయితే అధికారులు మాత్రం వారికి నచ్చజెబుతున్నారు. ఇండోనేసియాలోని క్రియాశీలక అగ్ని పర్వతాల్లో మౌంట్‌ ఇబు కూడా ఒకటి. అది గత జూన్‌ నుంచి మరింత క్రియాశీలకంగా మారింది.

First Published:  20 Jan 2025 1:35 PM IST
Next Story