2000 దాటిన మొరాకో భూకంప మృతులు.. శిథిలాల కిందే వందల మంది..!
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన మరాకేష్‌కు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భారీ భూకంపం కనీవినీ ఎరుగని నష్టాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2 వేలు దాటగా.. మరో 2 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో వెయ్యి మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మారుమూల పర్వత ప్రాంతాల్లోని గ్రామాల్లో శిథిలాల కింద పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ధాటికి.. ఊళ్లకు ఊళ్లే ధ్వంసమయ్యాయి. అల్-హౌజ్‌తో పాటు తరౌడంట్ ప్రావిన్సులలో నష్టం ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన మరాకేష్‌కు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. తర్వాత 19 నిమిషాలకే 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. తీరప్రాంత నగరాలైన రాబాట్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలోనూ భూమి బలంగా కంపించింది. యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించిన మరాకేష్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు తీవ్ర నష్టం వాటిల్లింది. 12వ శతాబ్దంలో నిర్మించిన మసీదు కటూబియా సైతం భూకంపం ధాటికి దెబ్బతింది. భూకంపం తీవ్రతకు రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇక భూకంప మృతులకు నివాళిగా మొరాకో ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
ఇక మొరాకోకు సాయం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ మొరాకోకు అవసరమైన సాయం అందిస్తామన్నారు. ఇజ్రాయిల్, అమెరికా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, జోర్డాన్, ఖతార్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. పొరుగుదేశం అల్జీరియా తన గగనతలంపై మొరాకో విమానాల రాకపోకలపై ఉన్న రెండేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వీలైనంత త్వరగా అవసరమైన సామగ్రిని మొరాకోకు తరలించవచ్చని తెలిపింది. ఇక మొరాకో పునర్నిర్మాణానికి సంవత్సరాలు పట్టొచ్చని రెడ్‌క్రాస్ సంస్థ అంచనా వేసింది.
చివరిసారి 2004లో ఈశాన్య మొరాకోలోని అల్‌హోసిమాలో సంభవించిన భూకంపం ధాటికి 628 మంది ప్రాణాలు కోల్పోయారు. 1980లో మొరాకో పొరుగుదేశం అల్జీరియాలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ టైంలో 2 వేల 500 మంది ప్రాణాలు కోల్పోగా.. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1960లో దక్షిణ మొరాకోలోని తీరప్రాంతం అగాదిర్‌లో 6.7 తీవ్రతతో భూకంపం రాగా.. 12 వేల మందికి పైగా చనిపోయారు.