మాటలకందని లిబియా విషాదం.. 20 వేల మంది మృతి..?
వరదల ప్రభావం డెర్నా సిటీపైనే తీవ్రంగా ఉంది. వరదల ధాటికి దాదాపు 20 శాతం సిటీ పూర్తిగా కొట్టుకుపోయింది. సెప్టెంబర్ 10న అర్ధరాత్రి ఒక్కసారిగా డెర్నానగరంపై వరదలు విరుచుకుపడ్డాయి.
డేనియల్ తుపాన్, ఆపై వరదలు సృష్టించిన బీభత్సానికి ఉత్తర ఆఫ్రికా దేశం లిబియా శవాలదిబ్బగా మారింది. ఇప్పటివరకు దాదాపు 6 వేల మృతదేహాలను వెలికితీయగా.. వరదల ధాటికి 20 వేల మంది మరణించి ఉంటారని అల్‌బైదా మెడికల్ సెంటర్ వెల్లడించింది. అధికారిక లెక్కలు వచ్చే వరకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఇక డెర్నా సిటీ మేయర్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మృతుల్లో 4 వందల మంది విదేశీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది. 30 వేల మంది నిరాశ్రయులుగా మారారు.
ఇక వరదల ప్రభావం డెర్నా సిటీపైనే తీవ్రంగా ఉంది. వరదల ధాటికి దాదాపు 20 శాతం సిటీ పూర్తిగా కొట్టుకుపోయింది. సెప్టెంబర్ 10న అర్ధరాత్రి ఒక్కసారిగా డెర్నానగరంపై వరదలు విరుచుకుపడ్డాయి. చాలామంది నిద్రలోనే కొట్టుకుపోయారు. బహుళ అంతస్తుల భవనాలు సైతం వరద ధాటికి నిలబడలేకపోయాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వేలమంది వరదల్లో కొట్టుకుపోయారు. వరదల ధాటికి కొట్టుకువచ్చిన ఓ కారు.. బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ బాల్కనిలో చిక్కుకుందంటే ఏ స్థాయిలో వరదలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఇక డెర్నా బీచ్ పూర్తిగా చెత్త కుప్పను తలపిస్తోంది. బట్టలు, ఫర్నిచర్, బొమ్మలతో నిండిపోయింది.
సెప్టెంబర్ 4న ఏర్పడిన డేనియల్ తుపాన్.. టర్కీ, గ్రీస్, బల్గేరియాలో వరదలకు కారణమైంది. ఆయా దేశాల్లో తుపాన్ కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత క్రమంగా మద్యధరా సముద్రం మీదుగా కదిలిన డేనియల్ తుపాన్ సెప్టెంబర్ 10న లిబియాలో తీరం దాటింది. భౌగోళికంగా డేర్నా సిటీ.. ఉత్తర ఆఫ్రికాలో మద్యధరా తీరం వెంబడి విస్తరించి ఉంది. వాడి డెర్నా నది డెర్నా సిటీ మధ్యలో నుంచి ప్రవహించి ఇక్కడే మద్యధరా సముద్రంలో కలుస్తుంది. డేనియల్ తుపాన్ ధాటికి వాడి డెర్నా నదికి భారీగా వరద వచ్చింది. ఈ వరదల ధాటికి డెర్నా సిటీకి ఎగువన నిర్మించిన ఈ నదిపై రెండు డ్యాములు కొట్టుకుపోయాయి. దాంతో దాదాపు 30 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా డెర్నా సిటీని రాత్రికి రాత్రే ముంచెత్తింది. వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. బాహ్య ప్రపంచంతో డెర్నా సిటీకి సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదం జరిగిన 36 గంటల తర్వాత సహాయక చర్యలు మొదలయ్యాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈజిప్ట్, ట్యునిషియా, ఖతార్, యూఏఈ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.