అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్
ఇండియా కాకస్ సహా అధ్యక్షుడిగా పనిచేస్తున్న మైక్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించబోతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన పాలనవర్గం కూర్పును వేగవంతం చేశారు. ఇప్పటికే పలు కీలక బాధ్యతలకు నియామకాలు చేపట్టిన ఆయన.. తాజాగా అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారుగా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్‌ను నియమించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే నూతన అధ్యక్షుడు ట్రంప్ ఆయన పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఓ మీడియా సంస్థ పేర్కొన్నట్లుగా ఉన్న పోస్టును రీ పోస్ట్ చేస్తూ ట్రంప్ రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు చేసిన మరో అత్యుత్తమ ఎంపిక అంటూ ప్రశంసించారు. అమెరికా ఆర్మీలోని ప్రత్యేక భద్రతా దళం అయిన గ్రీన్ బెరెట్‌గాలో ఆర్మీ కల్నల్‌గా రిటైర్డ్ అయిన వాల్జ్ 2019 నుంచి ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కాకస్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.