ఈ దుర్వినియోగం భయానకం.. - డీప్ ఫేక్ వీడియోలపై సత్య నాదెళ్ల
డీప్ ఫేక్ కట్టడికి ఈ సందర్భంగా సత్య నాదెళ్ల పలు సూచనలు కూడా చేశారు. డీప్ ఫేక్ కట్టడికి దర్యాప్తు సంస్థలు, టెక్ సంస్థలు కలిసి వస్తే.. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వాటిని అరికట్టవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నవారు రోజురోజుకూ హద్దులు మీరుతూ సెలబ్రిటీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తీవ్రంగా స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. డీప్ ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం భయానకమైనదని చెప్పారు. ఇటీవల కాలంలో నెట్టింట్లో వెలుగులోకి వస్తోన్న సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాల విషయమై ఆయన స్పందించారు.
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌కు చెందిన తీవ్ర అభ్యంతరకర డీప్ ఫేక్ వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల స్పందిస్తూ టెక్నాలజీని ఈ తీరులో దుర్వినియోగం చేయడం చాలా భయానకమైనదని చెప్పారు. దీనిపై వేగంగా స్పందించడం అవసరమని తాను భావిస్తున్నానని తెలిపారు. ఆన్‌లైన్‌లో సురక్షితమైన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుందని నిర్ధారించేందుకు కట్టుదిట్టమైన నిబంధనలు ఉండాలని చెప్పారు. డీప్ ఫేక్ కట్టడికి ఈ సందర్భంగా సత్య నాదెళ్ల పలు సూచనలు కూడా చేశారు. డీప్ ఫేక్ కట్టడికి దర్యాప్తు సంస్థలు, టెక్ సంస్థలు కలిసి వస్తే.. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వాటిని అరికట్టవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను అనుకరిస్తూ ముందుగానే రికార్డు చేసిన ఫోన్ కాల్, స్విఫ్ట్‌కు చెందిన అభ్యంతరకర దృశ్యాలపై ఇప్పటికే వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘తప్పుడు చిత్రాలు, సమాచార వ్యాప్తిపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తాం’ అని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. దీనిని కట్టడి చేసే విషయంలో సోషల్ మీడియా సంస్థలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాప్ స్టార్ చిత్రాలపై ఎక్స్(ట్విటర్) చర్యలు తీసుకుంది. ‘మేం వెంటనే ఆ చిత్రాలను తొలగించాం. వీటిని పోస్టు చేసిన ఖాతాలపై తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని ఎక్స్ వెల్లడించింది. ఈ చర్యల తర్వాత నుంచి ఆమె పేరుతో సెర్చ్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి.