Telugu Global
International

తగ్గేదే లేదు.. ఫేస్ బుక్ లో మేనేజర్లపై వేటు

‘పనిచేసే వారిని మేనేజ్‌ చేసే మేనేజర్లు, వారిని నియంత్రించే మరికొంత మంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్‌ చేసే మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజిమెంట్‌ వ్యవస్థ అవసరమని అనుకోవడం లేదు’ అని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పేర్కొన్నారు.

తగ్గేదే లేదు.. ఫేస్ బుక్ లో మేనేజర్లపై వేటు
X

మెటాగా మారిన ఫేస్ బుక్ సంస్థ ఇటీవలే 11వేల మంది ఉద్యోగులకు ఒకేసారి లే ఆఫ్ ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆ సంస్థ యాజమాన్యం తగ్గేలా లేదు. ఈసారి మేనేజర్లను టార్గెట్ చేసుకున్నారు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్. మేనేజర్ వ్యవస్థకు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారట. దీనిపై ఇటీవలే ఆయన చిన్న హింట్ ఇచ్చారని.. ఇకపై మెటా, మేనేజర్లను భరించలేదని చెప్పారట. అయితే ఎంతమందిని తీసేస్తారు, ఎంతమందికి పనిలేకుండా చేసి పక్కనపెడతారు అనేది ఇంకా తెలియడంలేదు. మేనేజర్లుగా మెటాలో పనిచేస్తున్నవారందరికీ ఇది షాకింగ్ న్యూసే.

సంస్థకు అవసరమైనప్పుడు మేనేజర్లు కావాలని ఏరికోరి కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగులను తగ్గించాలనుకుంటున్నప్పుడు మాత్రం అసలింతమంది మేనేజర్లు మనకు అవసరమా అంటున్నారట జుకర్ బర్గ్. మేనేజర్లపై మళ్లీ మేనేజర్లు ఎందుకు అంటూ కంపెనీ అంతర్గత మీటింగ్ లో అసహనం వ్యక్తం చేశారట. ఓ దశలో అసలు మేనేజర్లు అవసరం లేదు కదా అని కూడా అన్నారట. మెటాలో మేనేజర్ వ్యవస్థపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారందరికీ ఒకేసారి లేఆఫ్ ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది.

‘పనిచేసే వారిని మేనేజ్‌ చేసే మేనేజర్లు, వారిని నియంత్రించే మరికొంత మంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్‌ చేసే మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజిమెంట్‌ వ్యవస్థ అవసరమని అనుకోవడం లేదు’ అని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మేనేజర్లకు పింక్‌ స్లిప్పులు ఖాయమని తేలిపోయింది. మధ్యస్థాయి వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే ఆలోచనలో జుకర్ బర్గ్ ఉన్నారు. 18 ఏళ్ల కంపెనీ చరిత్రలో ఒకేసారి 11వేలమందికి లే ఆఫ్ ప్రకటించడం ఇటీవలే తొలిసారిగా జరిగింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మేనేజర్ల వ్యవస్థకు మంగళం పాడుతున్నారు జుకర్ బర్గ్. ముందు ముందు ఉద్యోగాల్లో మరిన్ని కోతలు ఉండొచ్చని అంటున్నారు.

First Published:  31 Jan 2023 12:05 AM GMT
Next Story