ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్వీట్టర్ లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన రష్యా
తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాయని పాశ్చాత్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ల మీద రష్యా ఆగ్రహంగాఉంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లను రష్యా ప్రభుత్వం మార్చిలో బ్లాక్ చేసింది. ఇప్పుడు వాటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.
మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని సోషల్ మీడియా సైట్లు ఉక్రేనియన్ యూజర్ల ద్వారా రష్యన్‌లపై హింసను ప్రోత్సహించే విషయాలను పోస్ట్ చేస్తూ తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నారని మాస్కో కోర్టు అభియోగాలు మోపింది.
ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలైనప్పటి నుండి, రష్యా సోషల్ మీడియాపై తన పట్టును పెంచుకుంది. రష్యన్‌లపై హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ పాశ్చాత్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ల ప్రాభల్యాన్ని నిరోధించింది, ప్రతీకారంగా, యూరోపియన్ టెక్ కంపెనీలు రష్యన్ స్టేట్ స్పాన్సర్డ్ మీడియాను డీమోనిటైజ్ చేసి బ్లాక్ లిస్ట్ చేశాయి.
అయితే రష్యా ఆరోపణలను ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ మాతృసంస్థ మెటా ఖండించింది. తమ సంస్థ ఎప్పుడూ తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొనలేదని, రష్యా ఫోబియాకు తాము వ్యతిరేకమని మెటా న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మరో వైపు రష్యా, ఉక్రేనియన్ దళాల మధ్య పోరాటం తొమ్మిదవ నెలలోకి ప్రవేశించింది, యుద్దానికి ఎటువంటి ముగింపు కనిపించడంలేదు. రష్యా మంగళవారం కూడా ఉక్రెయిన్ అంతటా భారీ క్షిపణిలతో దాడులు చేసింది. ఉక్రెయిన్ లో ఇంధన సౌకర్యాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. సెంట్రల్ ఉక్రేనియన్ ప్రావిన్స్ డ్నిప్రోపెట్రోవ్స్క్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుంది.