ధ్యానం అంటే లగ్జరీ కాదు
జీవితంలో రోజురోజుకీ పెరుగుతున్న ఒత్తిడి, హింస, సమాజంలో క్షీణిస్తున్న విశ్వాసాలు, పరస్పర సంబంధాలు వంటి సమస్యలకు ధాన్యం సమగ్రమైన పరిష్కారాన్ని చూపగలదన్న శ్రీశ్రీ రవిశంకర్

అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రారరంభ సెషన్‌లో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కీలక ప్రసంగం చేశారు. ధ్యానం చేయడం అంటే ఇవాళ మనం అనుకుంటున్నట్లు విలాసవంతంగా చేసుకొనే కార్యక్రమం కాదని.. ప్రతీ మనిషికి అది ఒక అవసరమని తెలిపారు. మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ధ్యానంగా చెప్పొచ్చని అన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రజలపై కోపం, కుంగుబాటు ప్రభావం అధికంగా ఉంటున్నదని వాటిని జయించడానికి ధ్యానం ఉపయోగపడుతుందని రవిశంకర్ పేర్కొన్నారు.
జీవితంలో రోజురోజుకీ పెరుగుతున్న ఒత్తిడి, హింస, సమాజంలో క్షీణిస్తున్న విశ్వాసాలు, పరస్పర సంబంధాలు వంటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ధాన్యం సమగ్రమైన పరిష్కారాన్ని చూపగలదని రవిశంకర్ అన్నారు. ధ్యానం మనకు మానసిక ప్రశాంతతను, సమాజం, పర్యావరణంపై బాధ్యతను, స్పృహను కలిగిస్తుందని.. సంఘ విద్రోహ కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రపంచశాంతి, సమగ్రత, సమైక్యతలను పెంపొందించడంలో ధాన్యం పోషించగలిగే కీలకపాత్రను ఆయన వివరించారు.
డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నేడు మొట్టమొదటి ధ్యాన దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.