Telugu Global
International

ఇమ్రాన్‌ఖాన్‌కు ఎన్నికల సంఘం భారీ షాక్‌.. - 2 స్థానాల్లోనూ నామినేషన్ల తిరస్కరణ

ఇమ్రాన్‌తో పాటు విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ, మరో మాజీ మంత్రి హమ్మద్‌ అజర్‌ నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి.

ఇమ్రాన్‌ఖాన్‌కు ఎన్నికల సంఘం భారీ షాక్‌.. - 2 స్థానాల్లోనూ నామినేషన్ల తిరస్కరణ
X

వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను అక్కడి ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ విషయాన్ని అక్కడి వార్తా సంస్థలు శనివారం వెల్లడించాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే.. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు నిలిపివేసింది.

తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు లాహోర్‌ (ఎన్‌ఏ– 122), మియావలీ (ఎన్‌ఏ– 89) స్థానాల నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ నామినేషన్లు దాఖలు చేశారు. తోషాఖానా అవినీతి కేసు నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడటంతో పాటు.. నామినేషన్లలో ఆయనను ప్రతిపాదించినవారు సంబంధిత నియోజకవర్గాలకు చెందినవారు కాదనే అభ్యంతరాలు, ఇతర అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా అభ్యంతరాలతో ఏకీభవించిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు.. ఆయన నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి.

అంతేకాదు.. ఇమ్రాన్‌తో పాటు విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ, మరో మాజీ మంత్రి హమ్మద్‌ అజర్‌ నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. అయితే.. వారు తమ నామినేషన్‌ పత్రాల తిరస్కరణకు వ్యతిరేకంగా జనవరి 3వ తేదీ లోపు అప్పీల్‌ చేయొచ్చు. జనవరి 10లోపు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇక పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు 2024 సంవత్సరం ఫిబ్రవరి 8న జరగనున్నాయి.

First Published:  31 Dec 2023 3:41 AM GMT
Next Story